Begin typing your search above and press return to search.

ఐటీ రైడ్స్ సీక్వెల్.. ఈడీ రంగంలోకి దిగుతోందా?

By:  Tupaki Desk   |   18 Feb 2020 2:00 PM IST
ఐటీ రైడ్స్ సీక్వెల్.. ఈడీ రంగంలోకి దిగుతోందా?
X
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన ఐటీ రైడ్స్ విష‌యంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ రంగంలోకి దిగుతూ ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ ఐటీ రైడ్స్ విష‌యంలో భిన్న‌వాద‌న‌లు వినిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం వ్య‌తిరేక వ‌ర్గాలేమో రెండు వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ అక్ర‌మాస్తులు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని అంటున్నాయి. టీడీపీ వ‌ర్గాలేమో అలాంటిదేమీ లేదు కేవ‌లం రెండు ల‌క్ష‌ల రూపాయ‌లే అని అంటున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్లు ఐటీ రైడ్స్ పంచ‌నామాలో కేవ‌లం ఒక పేజీని మాత్ర‌మే చూపించాయ‌నే క్లారిటీ వ‌చ్చింది. అందులో ఇంకా చాలా ఉంద‌ని, కేవ‌లం ఒక పేజీని మాత్ర‌మే చూపించార‌నే స్ప‌ష్ట‌త వ‌చ్చింది.

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఈ వ్య‌వ‌హారంలోకి ఈడీ ఎంట‌ర్ కాబోతోంద‌ని వార్త‌లు వ‌స్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ మొత్తం వ్య‌వ‌హారానికి సంబంధించి కొన్ని నెల‌ల కింద‌టే క‌థ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. న‌కిలీ బిల్లుల‌ను క్రియేట్ చేసి కొన్ని కాంట్రాక్టు సంస్థ‌లు భారీగా ప్ర‌భుత్వం నుంచి సొమ్ములు పొందాయ‌నే విష‌యాన్ని కొన్ని నెల‌ల కింద‌టే ఐటీ, ఈడీలు గుర్తించిన‌ట్టు గా తెలుస్తోంది. అక్క‌డ ఈ వ్య‌వ‌హారంలో ఏపీ మూలాలు దొరికాయ‌ని వాటి ఆధారంగానే ఏపీలో ఐటీ రైడ్స్ జ‌రిగాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అస‌లు ఏపీలో రైడ్స్ నిర్వ‌హించింది ఐటీ వ‌ర్గాలా, లేక ఈడీ వ‌ర్గాలా అనేది కూడా మొద‌ట క్లారిటీ లేదు. చివ‌ర‌కు ఐటీ శాఖ ఈ విష‌యంలో స్పందించ‌డంతో జ‌రిగింది ఐటీ దాడులే అనే క్లారిటీ వచ్చింది. ఆ త‌ర్వాతి వాదోపవాదాలు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఈ మొత్తం వ్య‌వ‌హారంలోకి ఈడీ రంగంలోకి దిగుతోంద‌ని స‌మాచారం.

కొంద‌రు ప్ర‌భుత్వ పెద్ద‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని, కాంట్రాక్ట‌ర్ల ద్వారా క‌మిష‌న్లు తీసుకునేందుకు కొన్ని ఎత్తుగడ‌లు వేసిన‌ట్టుగా ఈడీ గుర్తించింద‌ట‌. ప్ర‌భుత్వం నుంచి కొన్ని ప‌నులు పొందుతాయి కాంట్రాక్టు సంస్థ‌లు. అంచ‌నాల మొత్తాన్ని పెంచేసి, వాస్త‌వ విరుద్ధ‌మైన స్థాయికి వాటికి కాంట్రాక్టుల‌ను అప్ప‌గించ‌డం చేస్తారు స‌ద‌రు పెద్ద‌లు. ప్ర‌తిగా ఆ సంస్థలు వారికి క‌మిష‌న్ ఇస్తాయి. ఆ క‌మిష‌న్లను డైరెక్టుగా ఇవ్వ‌కుండా కొన్ని నకిలీ సబ్ కాంట్రాక్టు సంస్థ‌ల ద్వారా వారికి చెల్లిస్తారు. ఆ స‌బ్ కాంట్రాక్టు సంస్థ‌లు ఎలాంటి ప‌నులూ చేయ‌వు, కానీ కాంట్రాక్ట‌ర్లు వారికి డ‌బ్బులు ఇస్తారు. అదంతా అక్ర‌మ క‌మిష‌న్ల వ్య‌వ‌హార‌మే అనేది ఈ స్కామ్ లో వినిపిస్తున్న ఆరోప‌ణ‌. మ‌రి ఈడీ రంగంలోకి దిగితే ఈ వ్య‌వ‌హారంలో సంచ‌ల‌నం మొద‌లైన‌ట్టే!