Begin typing your search above and press return to search.

జేసీలపై ఈడీ దాడులకు కారణం ఇదేనా?

By:  Tupaki Desk   |   18 Jun 2022 11:30 AM GMT
జేసీలపై ఈడీ దాడులకు కారణం ఇదేనా?
X
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ సోదరుల ఇళ్ళు, ఆఫీసులపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉన్నతాధికారులు దాడులు చేయటం సంచలనంగా మారింది. తాడిపత్రి, అనంతపురంతో పాటు హైదరాబాద్ లోని ఇళ్ళు, ఆఫీసులపై ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులు చేశారు. మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి, మాజీ ఎంఎల్ఏ, ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకరరెడ్డి ఇళ్ళపైన ఈడీ దాడులు చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

జేసీల ఇళ్ళపై దాడులు జరగటానికి రెండు కారణాలు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. మొదటిదేమో వీళ్ళ కంపెనీ లక్షల టన్నుల సున్నపురాయిని అక్రమంగా తవ్వేసుకున్నదని గతంలోనే నిరూపణైంది. దానికి సంబంధించిన ఆరోపణలపైనే ఇపుడు ఈడీ దాడులు చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఇక రెండో కారణం మాత్రం రాజకీయపరమైనదే. రాజకీయంగా మాజీ ఎంపీ ఇపుడు పెద్దగా క్రియాశీలకంగా లేరన్నది వాస్తవం.

ఇదే సమయంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాత్రం యాక్టివ్ గా ఉన్నారు. వీళ్ళిద్దరు టీడీపీకి రాజీనామా చేసి తొందరలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది.

గతంలో వీళ్ళు కూడా ఇలాంటి కలరింగే ఇచ్చారు కానీ కమలం పార్టీలో చేరలేదు. ఈ నేపధ్యంలోనే జేసీ సోదరులను తన దారికి తెచ్చుకునేందుకు కేంద్రం వీళ్ళపై ఈడీని ప్రయోగించిందనే చర్చ పెరిగిపోతోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా నేతలను తన దారికి తెచ్చుకునేందుకు బీజేపీ ఇదే పనిచేయిస్తోందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.

2019 ఎన్నికల వరకు టీడీపీలో యాక్టివ్ గా ఉన్న ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళపై సీబీఐ, ఈడీ, ఐటీ ఉన్నతాధికారులు ఎన్నిసార్లు దాడులు చేశారో లెక్కేలేదు. ఈరోజో రేపో అరెస్టు తప్పదన్నంతగా బిల్డప్ ఇచ్చారు.

తీరా ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోగానే వీళ్ళు బీజేపీలో చేరిపోయారు. అంతే గడచిన మూడేళ్ళుగా వీళ్ళపై ఒక్కటంటే ఒక్క దాడి కూడా జరగలేదు. జరిగినవి చూసిన తర్వాత తాజా ఈడీ దాడులు జేపీలను లొంగదీసుకోవటంలో భాగమనే ప్రచారానికి మద్దతు పెరుగుతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి