Begin typing your search above and press return to search.

నోటీసులు ఇస్తే నిందితులు కారు!!

By:  Tupaki Desk   |   14 July 2017 10:08 AM GMT
నోటీసులు ఇస్తే నిందితులు కారు!!
X
హైద‌రాబాదులో ప‌ట్టుబ‌డ్డ డ్ర‌గ్స్ వ్యాపారి కెల్విన్ వ్య‌వ‌హారం ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ మెడ‌కు చుట్టేసుకుంది. కెల్విన్ తో పాటు ప‌ట్టుబ‌డ్డ మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల డేటాను ప‌రిశీలించిన పోలీసులు... వీరి వ‌ద్ద నుంచి ఎవ‌రెవ‌రు డ్ర‌గ్స్ కొనుగోలు చేశార‌న్న విష‌యంపై ఓ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు నోటీసులు జారీ చేశామ‌న్న వార్త‌ల‌ను లీక్ చేసిన పోలీసులు పెను దుమార‌మే రేపారు. తాజాగా నేటి ఉద‌యం మీడియా ముందుకు వ‌చ్చిన ఎక్సైజ్ శాఖ ఉన్న‌తాధికారి అకున్ స‌బ‌ర్వాల్... టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు నోటీసులు జారీ చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని, ఈ వ్య‌వ‌హారం గుట్టు మొత్తాన్ని ర‌ట్టు చేసే దాకా విశ్ర‌మించ‌మ‌ని తెలిపారు.

అదే స‌మ‌యంలో టాలీవుడ్‌లో ఎవ‌రెవ‌రికి నోటీసులు జారీ అయ్యాయన్న విష‌యంపై ఓ 12 మంది పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. వీరిలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ తో పాటు అగ్ర హీరో ర‌వితేజ‌, యువ హీరోలు న‌వ‌దీప్‌, త‌రుణ్‌, నందూ, త‌నీష్, హీరోయిన్ చార్మీ, ఐటెం గ‌ర్ల్ ముమైత్ ఖాన్ వంటి ప్ర‌ముఖులు ఉన్నారన్న వార్త‌లు పెద్ద క‌ల‌క‌ల‌మే రేపుతున్నాయి. ఈ క్ర‌మంలో ఎవ‌రికి వారుగా మీడియా ముందుకు వ‌స్తున్న వీరంతా... త‌మ త‌మ వాద‌న‌లు వినిపిస్తున్నారు. ఈ త‌ర‌హాలోనే కాసేప‌టి క్రితం మీడియా ముందుకు వ‌చ్చిన యువ హీరో త‌నీష్‌... ఈ వార్త‌ల‌పై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. త‌న‌కు అస‌లు నోటీసులే అంద‌లేద‌ని అత‌డు పేర్కొన్నాడు. అయినా నోటీసులు వ‌స్తేనే... నేరం చేసిన‌ట్లు అవుతుందా? అంటూ ప్ర‌శ్నించిన అత‌డు... నోటీసులు వ‌చ్చినా... విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని చెప్పాడు. త‌న‌కైతే ఇప్ప‌టివ‌రకు నోటీసులు అంద‌లేద‌ని మాత్రం అత‌డు స్ప‌ష్టంగానే చెప్పాడు.

అదే స‌మ‌యంలో నిజానిజాలు తెలుసుకోకుండా మీడియా హ‌డావిడి చేయ‌డం వ‌ల్ల త‌న కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ప‌డిపోతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. త‌న‌కు తండ్రి లేడ‌ని, ఇప్పుడు కుటుంబానికి పెద్ద‌గా తానే ఉన్నాన‌ని, ఇలాంటి స‌మ‌యంలో ఏవో ఊహాగానాలను ఆస‌రా చేసుకుని ఈ వ్య‌వ‌హారంలో త‌న‌కు ప్ర‌మేయం ఉన్న‌ట్లు వార్త‌లు ప్ర‌చురిస్తే... త‌న కుటుంబం ప‌రిస్థితి ఏం కావాల‌ని కూడా అత‌డు ప్ర‌శ్నించాడు. అయినా తాను డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై పోరుకు సంబంధించి జ‌రుగుతున్న ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఉన్నాన‌ని కూడా అత‌డు చెప్పాడు.

డ్ర‌గ్స్‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నాడు. మీడియా కూడా డ్ర‌గ్స్ వ్య‌వ‌హారానికి సంబంధించిన వార్త‌ల‌ను ప్ర‌చురించే స‌మ‌యంలో సంయ‌మ‌నం పాటించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చెప్పాడు. టాలీవుడ్‌లోనే ఈ త‌ర‌హా దందా సాగుతోంద‌న్న వార్త‌ల‌తోనే మాత్ర‌మే తాను మీడియా ముందుకు రాలేద‌ని, హైద‌రాబాదు మ‌హా న‌గ‌రాన్ని కూడా ఈ త‌ర‌హా వార్త‌లు పెను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నాయ‌ని, ఈ కార‌ణంగానే తాను మీడియా ముందుకు రావాల్సి వ‌చ్చింద‌ని త‌నీష్ చెప్పాడు.

ఇదిలా ఉంటే... నేటి ఉద‌యం మీడియా ముందుకు వ‌చ్చిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ అకున్ స‌బ‌ర్వాల్ కూడా త‌నీష్ వాద‌న‌లోని ఆవేద‌న నిజ‌మేన‌న్న‌ట్లుగా మాట్లాడారు. ఈ వ్య‌వ‌హారంలో తాము కొంద‌రికి నోటీసులు ఇచ్చిన మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పిన స‌బ‌ర్వాల్... మీడియాలో వ‌చ్చిన పేర్ల‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని తెలిపారు. 8 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చినట్లు ఆయ‌న‌ చెప్పారు. 19 నుంచి 27వ తేదీ వరకు నోటీసులు ఇచ్చిన వారిని విచారిస్తామన్నారు. మీడియాలో వ‌చ్చిన పేర్ల గురించి ప్రశ్నించగా... పేర్ల విషయంలో తాను మాట్లాడనని చెప్పారు. నోటీసులు ఇచ్చినంత మాత్రాన వారంద‌రూ నిందితులు కారన్నారు. వారి పేర్లు బయటపెట్టడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ప్రచారంలో ఉన్న పేర్లకు, తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.