Begin typing your search above and press return to search.

అంకెల గారడే: ప్యాకేజీ ప్ర‌క‌‌ట‌న కొండంత.. ఇచ్చేది గోరంత‌

By:  Tupaki Desk   |   18 May 2020 6:50 AM GMT
అంకెల గారడే: ప్యాకేజీ ప్ర‌క‌‌ట‌న కొండంత.. ఇచ్చేది గోరంత‌
X
లాక్‌డౌన్ విధించి రెండు నెల‌లు దాటింది. ప్ర‌స్తుతం నాలుగో ద‌శ లాక్‌డౌన్ కూడా కొన‌సాగుతోంది. ఇన్నాళ్లు ప్ర‌జ‌ల‌ను ఇంటికే ప‌రిమితం చేయ‌డంతో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలిపోయింది. ప్ర‌జ‌ల ఆదాయం క్షీణించింది. ముఖ్యంగా పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు కుటుంబ పోష‌ణ క‌ష్ట‌త‌ర‌మైంది. ఈ స‌మ‌యంలోనే ప్ర‌జ‌లు, ఆర్థిక వ్య‌వ‌స్థ కోలుకునేలా భారీ ఆర్థిక ప్యాకేజీ ఇస్తున్న‌ట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్ర‌క‌టించారు. మొత్తం రూ.20 లక్షల కోట్ల (జీడీపీలో 10 శాతం) ప్యాకేజీ అని ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి చెప్పారు. వాటిని ఐదు ద‌శ‌లుగా చెల్లిస్తామ‌ని తెలిపారు. అందుక‌నుగుణంగా ఆ తెల్లారి నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఐదు రోజుల పాటు మీడియా ముందుకు వ‌చ్చి అంకెలు చెప్పి వెళ్లిపోయారు.

ఆమె చేసిన‌న్ని ప్రకటనలు ఎవ‌రికీ అర్థం కాలేదు. ఏవేవో ప‌థ‌కాలు చెప్పి.. దానికింత‌.. దీనికింత అని ప్రెస్‌మీట్లు చెప్పి వెళ్లిపోయారు. ఈ అంకెల‌ను చూసి ఎవ‌రికీ ఏం అర్థం కాలేదు. ఆమె చేసిన ప్ర‌క‌ట‌న‌లు చూస్తే త‌మ‌‌కు ఒక్క రూపాయి కూడా నేరుగా అందద‌ని ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌త తెచ్చుకున్నారు. ఆత్మ నిర్భ‌ర భార‌త్ ప్ర‌జ‌ల మ‌నోనిబ్బ‌రం కోల్పోయేలా చేసింది.

మొత్తం దాదాపు రూ.21 లక్షల ప్యాకేజీ కేంద్రం ప్ర‌క‌టించింది.
మొదటి రోజు రూ.5,94,550 కోట్లు
రెండో రోజు రూ.3,10,000 కోట్లు
మూడో రోజు రూ.1,50,000 కోట్లు
అంతకుముందు గరీబ్ కల్యాణ్ యోజన కింద రూ.1,92,800 కోట్లు, ఆర్బీఐ ప్రకటన రూ.8,01,603 కోట్లు. వీట‌న్నిటిని క‌లిపితే మొత్తం రూ.20,97,053 కోట్లు.

అయితే ఈ ప్యాకేజీ పై కొన్ని ఆర్థిక సంస్థలు అధ్య‌య‌నం చేశాయి. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రూ.2.02 లక్షల కోట్ల ప్యాకేజీలో బడ్జెట్ ఖర్చు రూ.2.02 లక్షల కోట్లు మాత్రమేనని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) త‌న నివేదికలో తెలిపింది. మొత్తం ప్యాకేజీలో ఇది 10 శాతం కూడా కాదని స్ప‌ష్టం చేసింది. ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పిన మాట‌ల‌కు చాలా తక్కువగా ఇచ్చిందని వెల్ల‌డించింది. ఉదాహ‌ర‌ణ‌కు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ ప్రకటించిన నిధుల చలామణి పెంపు చర్యల ద్వారానే రూ.8.01 లక్షల కోట్లు అందుబాటులోకి వచ్చాయి. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో కేవలం 10 శాతం మాత్రమే కేంద్రంపై భారం మోపుతుందని, మిగతా నిధులు ఆర్బీఐ ప్రకటించిన ద్రవ్య చలామణి పెంపు చర్యలు, ప్రభుత్వ రుణ హామీ పథకం, బీమా పథకాల ద్వారా సమకూరుతాయని ఆ సంస్థ వివ‌రించింది.

బడ్జెట్‌ పై ప్రభావం రూ.1.50 లక్షల కోట్లే ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పటికీ బడ్జెట్ పైన ప్రభావం మాత్రం కేవలం రూ.1.50 లక్షల కోట్లు మాత్రమేనని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇది జీడీపీలో 0.5 శాతం మాత్రమేనని తేల్చిచెప్పారు. కేంద్రం ప్ర‌జ‌ల‌కు కరోనా సాయం అని చెప్పి ద్రవ్యలోటు కట్టడికే ప్రాధాన్యం ఇచ్చిందని స‌మ‌గ్రంగా గ‌మ‌నిస్తే తెలుస్తోంది.

మొత్తం రూ.20 లక్షల కోట్లలో ప్రభుత్వం అందించిన ఉద్దీపన రూ.3.22 లక్షల కోట్లు మాత్రమేనని కాంగ్రెస్ తెలిపింది. జీడీపీలో ఈ ప్యాకేజీ విలువ 10 శాతం కాదని, కేవలం 1.6 శాతం మాత్రమేనని చెబుతోంది. కేంద్రం ప్రకటించిన మొత్తం ప్యాకేజీలో 15 శాతం మాత్రమేనని, మిగతా 85 శాతం ప్యాకేజీని ఆర్బీఐ, వాణిజ్య బ్యాంకులు, నాబార్డు భరిస్తున్నాయని వివ‌రించింది. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అమెరికా, యూరోపియన్ యూనియన్ కంటే తక్కువ అని కాంగ్రెస్‌, తృణ‌మూల్ కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్ కూడా విమ‌ర్శ‌లు చేసింది. ఈ ప్యాకేజీపై రాష్ట్రాలతో పాటు ప్ర‌జ‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.