Begin typing your search above and press return to search.

570 కోట్లు.. 195 కోట్లు పట్టుకున్నారు కానీ..

By:  Tupaki Desk   |   14 May 2016 6:12 AM GMT
570 కోట్లు.. 195 కోట్లు పట్టుకున్నారు కానీ..
X
ఎన్నికల వేళ డబ్బు సంచులు ఎంత వేగంగా మారతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పోటాపోటీగా సాగుతున్న తమిళనాడు ఎన్నికల్లో నోట్ల కట్టలు ఎంతటి ప్రభావం చూపిస్తాయన్నది బహిరంగ రహస్యమే. అధికారుల డేగకన్ను నుంచి తాము కోరుకున్నట్లుగా నోట్ల కట్టల్ని తరలించటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. గుట్టుచప్పుడు కాకుండా ఈ పని పూర్తి చేస్తుంటారు. ఇలాంటి ప్రయత్నంలో కొన్నిసార్లు పోలీసుల చేతికి చిక్కుతుంటారు.

తాజాగా అలాంటి సంఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. తిర్పూరులో మూడు కంటైనర్లను పోలీసులు తనిఖీల కోసం ఆపారు. ఆ కంటైనర్లను తనిఖీ చేసిన పోలీసులు షాక్ తిన్నంత పనైంది. ఎందుకంటే.. మూడు కంటైనర్లలో కలిపి మొత్తం రూ.570 కోట్లు విలువ చేసే నోట్ల కట్టలు ఉండటంతో వారి నోట మాట రాలేదు. ఇదిలా ఉంటే.. మరోవైపు రూ.195 కోట్ల నగదున్న కంటైనర్లు పోలీసుల చేతికి చిక్కటంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

రెండు ఉదంతాల్లో ఏకంగా రూ.765కోట్ల నోట్ల కట్టలు దొరికిపోవటం సంచలనం సృష్టించింది. అంతే మీడియా తన పని తాను చేసుకుంటూ పోయింది. హాట్ హాట్ గా సాగుతున్న ఎన్నికల ప్రచారాన్ని వదిలేసిన మీడియా ఈ వందల కోట్ల రూపాయిల నోట్ల కట్టల మీద పడింది. ఈ ఉదంతం బ్రేకింగ్ న్యూస్ గా మారింది. అయితే.. చావుకబురు చల్లగా అన్నట్లు ఈ భారీ మొత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన మొత్తమని.. దాన్ని తరలించే క్రమంలో పోలీసుల దృష్టికి ఇది వెళ్లిందని చెబుతున్నారు. అయినా.. ఎన్నికల వేళ ఇంత భారీ మొత్తాన్ని తరలించే సమయంలో పోలీసులకు సమాచారం అందించరా? సెక్యూరిటీ లేకుండానే ఇంత మొత్తాన్ని సింఫుల్ గా తరలిస్తారా? లాంటి సందేహాలకు సమాదానాలు రావాల్సి ఉంది. అయితే.. ఈ మొత్తం బ్యాంకు డబ్బుగా చెబుతున్నారు.