Begin typing your search above and press return to search.

మోడీ సర్కారుకు ఈసీ ప్రతిపాదన.. విదేశాల్లోని మనోళ్లకు ఆ అవకాశం

By:  Tupaki Desk   |   2 Dec 2020 9:46 AM IST
మోడీ సర్కారుకు ఈసీ ప్రతిపాదన.. విదేశాల్లోని మనోళ్లకు ఆ అవకాశం
X
కేంద్ర ఎన్నికల సంఘం ఆసక్తికర అంశాన్ని చర్చకు వచ్చేలా చేసింది. విదేశాల్లోని మనోళ్లకు ఓటుహక్కు కల్పించే దిశగా ఒక అడుగు ముందుకు వేసింది. తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారుకు ఒక ప్రతిపాదనను తీసుకెళ్లింది. కేంద్రం కానీ అనుమతి ఇస్తే.. విదేశాల్లో అర్హులైన భారతీయులకు ఓటుహక్కు కల్పించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సైనిక బలగాలకు అందుబాటులో ఉన్న ఈటీపీబీఎస్ (ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం) ను విదేశాల్లోని మనోళ్లకు వర్తింపచేయాలని భావిస్తున్నారు.

దీనికి సంబంధించి కేంద్రంలోని న్యాయశాఖ ముందు ఒక ప్రతిపాదనను తీసుకొచ్చింది. కేంద్రం కానీ ఓకే అంటే.. భద్రతా బలగాలకు ఏ విధానాన్ని అయితే అమలు చేస్తున్నారో.. విదేశాల్లోని మనోళ్లకు కూడా అలాంటి అవకాశాన్ని కల్పించే వీలుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. వచ్చే ఏడాది ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో దేశంలోని పలు రాష్ట్రాలకు (అసోం.. పశ్చిమబెంగాల్.. కేరళ.. తమిళనాడు.. పుదుచ్చేరి) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఎన్నికల్లో విదేశాల్లో ఉన్న అర్హులైన మనోళ్లకు ఓటుహక్కు కల్పించాలని భావిస్తున్నారు. ఎన్నికల వేళ..ఓటుహక్కు వినియోగించుకోవటానికి కొంతమంది భారీగా ఖర్చు చేసి మరీ దేశానికి వస్తున్నారు. సమయంతో పాటు.. డబ్బు కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న పరిస్థితుల్లో అలాంటి వారితో పాటు.. ఓటు వేయాలన్న ఆసక్తి ఉన్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ.. ఈ విధానానికి మోడీ సర్కారు ఓకే చెబితే.. పోలింగ్ వేళ.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోనే వీటిని కూడా కలిపి లెక్కిస్తారు. మరి.. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.