Begin typing your search above and press return to search.

పోస్ట్ డేటెడ్ చెక్కుల ఇష్యూ ఈసీ దృష్టికి వెళ్లింది!

By:  Tupaki Desk   |   13 Feb 2019 4:57 AM GMT
పోస్ట్ డేటెడ్ చెక్కుల ఇష్యూ ఈసీ దృష్టికి వెళ్లింది!
X
ఎన్నిక‌ల వేళ అధికారంలో ఉన్న వారికి కొన్ని అడ్వాంటేజ్ లు స‌హ‌జం. దాన్ని అస‌రాగా తీసుకొని ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం ఈమ‌ధ్య కాలంలో ఎక్కువైంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఏపీలోని బాబు స‌ర్కారును చూపించేటోళ్లు ఉన్నారు. రానున్న ఎన్నిక‌ల్ని దృష్టిలో పెట్టుకొని.. నాలుగేళ్లుగా బ్యాలెన్స్ ఉన్న హామీల్ని ఇప్పుడు ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా అమ‌లు చేయ‌టం ఈ మ‌ధ్య‌న క‌నిపిస్తోంది.

ఇందులో భాగంగా ల‌బ్దిదారుల‌కు అంద‌జేస్తున్న చెక్కులకు పోస్ట్ డేటెడ్ వేసి ఇవ్వ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌థ‌కం అమ‌లు చేసిన‌ట్లుగా పేరు తెచ్చుకోవ‌టం.. కానీ వాస్త‌వానికి ప‌థ‌కం అమ‌ల‌య్యేది మాత్రం త‌ర్వాత కావ‌టంపై.. ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఈ త‌ర‌హా ఘ‌న‌కార్యాల్లో మాస్ట‌ర్ డిగ్రీ ఉన్న బాబు.. రానున్న రోజుల్లో మ‌రిన్ని నిర్ణ‌యాలు తీసుకోవ‌చ్చ‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదిలా ఉంటే బాబు ప్ర‌భుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణ‌యాల మీద అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ ఫిర్యాదులు త‌మ‌కు అందిన‌ట్లుగా కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి సునీల్ ఆరోరా వెల్ల‌డించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. ఏపీలోని అన్ని పార్టీల ప్ర‌తినిధుల‌తో తాము స‌మావేశమ‌య్యామ‌ని.. వారు కొన్ని అభ్యంత‌రాల్ని లేవ‌నెత్తార‌న్నారు.

ఓట‌ర్ల జాబితాలో కొన్ని త‌ప్పులు ఉన్నాయని.. ఒక్క‌రికే రెండు.. మూడు ఓట్లు ఉన్నాయ‌న్న విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు.

కొన్ని పార్టీలు రేష‌న్ కార్డులు ఇచ్చేట‌ప్పుడు.. పెన్ష‌న్లు అందించేట‌ప్పుడు ప్ర‌మాణాలు చేయించుకున్న వైనాలు తమ దృష్టికి వ‌చ్చాయ‌న్నారు. మ‌హిళా ఓట‌ర్ల‌కు పోస్ట డేటెడ్ చెక్కులు ఇస్తున్నార‌న్న కంప్లైంట్స్ రావ‌టంతో వాటిపై ప్ర‌భుత్వం నుంచి నివేదిక కోరిన‌ట్లు వెల్ల‌డించారు. ఫిర్యాదులు వ‌చ్చిన చోట ఆడిట్ చేయాల‌న్న నిర్ణ‌యాన్ని తాము తీసుకున్నామ‌న్నారు.

కులాల ఆధారంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌టం సాధ్యం కాద‌న్న ఆయ‌న‌.. ఈవీఎంలు దుర్వినియోగం అయిన‌ట్లుగా ఇప్ప‌టివ‌ర‌కూ త‌మ దృష్టికి రాలేద‌న్నారు. ఈ అంశం మీద ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి ఫిర్యాదులు రాలేద‌ని.. ఒక‌వేళ వ‌స్తే మాత్రం ప‌రిశీలిస్తామ‌న్నారు. ఈవీఎంల‌పై సందేహాలు అవ‌స‌రం లేద‌న్నారు. ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేయ‌టం సాధ్యం కాద‌న్నారు.