Begin typing your search above and press return to search.

సీఎంపై ఎఫ్ ఐఆర్ న‌మోదుకు ఆదేశాలు

By:  Tupaki Desk   |   19 Jun 2017 4:54 AM GMT
సీఎంపై ఎఫ్ ఐఆర్ న‌మోదుకు ఆదేశాలు
X
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేసే మ‌రో ప‌రిణామం చోటు చేసుకుంది. అమ్మ మ‌ర‌ణం నేప‌థ్యంలో నిర్వ‌హించిన ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున ప్ర‌లోభాలు చోటు చేసుకోవ‌టంతో ఈ ఎన్నిక‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. ఉప ఎన్నిక స‌మ‌యంలో వెలుగులోకి వ‌చ్చిన ఒక వీడియో సంచ‌ల‌నం సృష్టించింది.

అధికార‌ప‌క్షానికి చెందిన అన్నాడీఎంకే (అమ్మ‌) నేతలు పెద్ద ఎత్తున డ‌బ్బులు పంచుతున్న‌ట్లుగా పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇదే స‌మ‌యంలో అధికార‌ప‌క్షానికి చెందిన నేత‌.. మంత్రి విజ‌య‌భాస్క‌ర్ ఇంటిపై ఐటీ అధికారులు త‌నిఖీలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున న‌గ‌దు ఆయ‌న ఇంట్లో బ‌య‌ట‌ప‌డింది. ఆపై నిర్వ‌హించిన త‌నిఖీల్లో రూ.90 కోట్ల మేర న‌గ‌దు పంపిణీ చేసిన‌ట్లుగా కొన్ని కీల‌క‌ప‌త్రాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతానికి సంబంధించి ఓట‌ర్ల‌ను డ‌బ్బుతో ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నించారంటూ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామి.. ఆరోగ్య శాఖామంత్రి విజ‌య‌భాస్క‌ర్‌.. అన్నాడీఎంకే (అమ్మ‌) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టీటీవీ దిన‌క‌ర్‌ ల‌పై ఎప్ ఐఆర్ న‌మోదు చేయాలంటూ ఆదివారం సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక అధికార‌పార్టీకి చెందిన ముఖ్యుల నెత్తికి చుట్టుకోవ‌టం ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు ఏకంగా ముఖ్య‌మంత్రి మీద‌నే ఎఫ్ ఐఆర్ దాఖ‌లు చేయాల‌ని కోర‌టం సంచ‌ల‌నంగా మారింది. ఓటుకు నోటు కేసులో సంబంధం ఉన్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ప్ర‌తిప‌క్ష నేత స్టాలిన్ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావును క‌లిసి డిమాండ్ చేయ‌టం తెలిసిందే. కంప్లైంట్ చేసిన అనంత‌రం కీల‌క ప‌రిణామం చోటు చేసుకోవ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ముఖ్య‌మంత్రిపైనే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని ఆదేశాలు జారీ అయిన నేప‌థ్యంలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/