Begin typing your search above and press return to search.

బాబు మాటలపై మంటలు - పరువు నష్టం దావా?

By:  Tupaki Desk   |   14 April 2019 6:04 AM GMT
బాబు మాటలపై మంటలు - పరువు నష్టం దావా?
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పోలింగ్ ప్రక్రియ తర్వాత చాలా తీవ్రంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకింత అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇదే ఊపులో ఆయన తీవ్రంగా స్పందిస్తూ ఎన్నికల కమిషన్ మీద, ఎన్నికల విధులు నిర్వహించిన రాష్ట్ర స్థాయి అధికారుల మీద కూడా దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. అదే మాటల్లో చంద్రబాబు ఒకింత వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది.

పోలింగ్ వేళ ఏపీ సీఎస్ గా వచ్చిన ఎల్వీ సుబ్రమణ్యంపై చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ఆయనపై కేసులు ఉన్నాయి, ఆయన జగన్ సహ నిందితుడు - డీజేపీ ఆఫీసుకు వెళ్లి ఆయన పోలింగ్ తీరును పర్యవేక్షించడం ఏమిటి..' చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దీనిపై పలువురు స్పందిస్తూ ఉన్నారు.

ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ ల సంఘం ఈ విషయంలో స్పందించింది. ఎల్వీ సుబ్రమణ్యం మీద బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని - ఆయనపై గతంలో కేసులు ఉండినా వాటిని హై కోర్టు పూర్తిగా కొట్టి వేసిందని - అవి తప్పుడు అభియోగాలుగా కోర్టు తేల్చిందని వారు గుర్తు చేశారు. ఎల్వీ సుబ్రమణ్యం ప్రస్తుతం ఏ కేసులోనూ దోషి కాదని పేర్కొన్నారు.

స్వయంగా కోర్టే ఆ విషయం చెప్పినా చంద్రబాబు నాయుడు సుబ్రమణ్యం విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రిటైర్డ్ ఐఏఎస్ లు మండి పడ్డారు.

అలాగే మరి కొందరు కూడా బాబు వ్యాఖ్యలను ఖండించారు. ఇక ఇప్పుడు ఈ వ్యవహారంపై ఎల్వీ సుబ్రమణ్యం కూడా కోర్టుకు ఎక్కనున్నట్టుగా తెలుస్తోంది. తనపై తెలుగుదేశం అధినేత తప్పుడు ప్రచారం చేస్తున్నారని - తన పరువుకు నష్టం కలిగిస్తున్నారని సీఎస్ హోదాలో ఉన్న ఆయన కోర్టులో దావా వేయనున్నట్టుగా తెలుస్తోంది.