Begin typing your search above and press return to search.

భూప్రకంపనలతో రాత్రంతా ఉత్తరాదికి నిద్ర లేదు

By:  Tupaki Desk   |   7 Feb 2017 4:41 AM GMT
భూప్రకంపనలతో రాత్రంతా ఉత్తరాదికి నిద్ర లేదు
X
సోమవారం రాత్రి పదిన్నర గంటలు. ఉత్తరాదిలోని ప్రజలు చాలావరకూ నిద్రకు ఉపక్రమించే సమయం. గ్రామీణ ప్రాంతాల్లోని వారు నిద్రలోకి వెళ్లిపోయారు. నగరవాసులు నిద్రకు సిద్ధమవుతున్న వేళ.. ఒక్కసారిగా భారీభూప్రకంపనలతో ఉత్తరాది చిగురుటాకులా వణికిపోయింది. దాదాపు 30 సెకండ్ల పాటు వణికిన భూమితో ఉత్తరాది వాసుకు నిద్ర ఒక్కసారిగా ఎగిరిపోయింది. భయంతో కొందరు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీయగా.. మరికొందరు ఏం జరిగిందో తెలియక షాక్ తో వణికిపోయారు.

మరోవైపు.. ఈ భూప్రకంపనలతో ప్రభుత్వ యంత్రాంగం అలెర్ట్ అయ్యింది. తాజా భూప్రకంపనలకు కారణం ఏమై ఉంటుందన్న దానిపై దృష్టి సారించారు. భూకంప కేంద్రాన్ని గుర్తించే ప్రయత్నం చేశారు. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లా కేంద్రంగా భూమికి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రమని తేల్చారు. తాజా ప్రకంపనలతో ఢిల్లీ.. పంబాజ్.. హర్యానా రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్ లోని నొయిడాలోనూ భూప్రకంపనలు వచ్చినట్లుగా ప్రజలు చెబుతున్నారు. రిక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రత 5.8గా నమోదైంది.

తొలుత ఉత్తరాఖండ్ లో భూప్రకంపనలు చోటు చేసుకోగా.. కాసేపటికే దేశ రాజధాని ఢిల్లీలో 5.3 తీవ్రతతో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా చోటు చేసుకున్న ప్రకంపనలతో జనాలు రోడ్లపైకి పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఈ ఉదంతంలో ఎలాంటి ప్రాణ.. ఆస్తి నష్టం చోటు చేసుకోలేదన్నవార్తలు వస్తున్నాయి. మరోవైపు తాజాభూప్రకంపనలపై పీఎంవో అధికారులు ఉత్తరాఖండ్ అధికారులతో టచ్ లో ఉండటమే కాదు.. నష్టంపై సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. భూకంప కేంద్రమైన రుద్రప్రయాగ్ కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయలుదేరి వెళ్లాయి. తాజా ప్రకంపనలతో ఉత్తరాదిలోని పలు ప్రాంతాల ప్రజలు భూప్రకంపన భయాలతో సోమవారం రాత్రి నిద్ర లేకుండా గడిపేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/