Begin typing your search above and press return to search.

ముందస్తు... ఎవరికి శుభమస్తు...

By:  Tupaki Desk   |   23 Aug 2018 4:26 AM GMT
ముందస్తు... ఎవరికి శుభమస్తు...
X
ముందస్తు. దేశవ్యాప్తంగా ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఎన్నికలకు ఇంకా గడువున్నా ఆరు నెలలో - ఏడాదో ముందుగా ఎన్నికలకు వెళ్లి తమకు అనుకూలంగా ఫలితాలను రాబట్టుకోవాలని అధికార పార్టీలు చేసే జిమ్మిక్కు. అయితే ఈ ముందస్తు గారడీలో చాలా సార్లు అధికార పార్టీలకు ఎదురుదెబ్బ తగిలిన సందర్భాలు కూడా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీ తమపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని భావించినా... లేదూ కాసింత చెడు అభిప్రాయం ఉందని ఊహించినా వెంటనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న సందర్భాలున్నాయి. ఈ ముందస్తు పదం కొన్ని పార్టీలను భయపెడితే కొన్ని పార్టీలు మాత్రం లాభ పడ్డాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ముందస్తు ఎన్నికలు కలిసిరాలేదు. సమైక్య రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మూడు సార్లు ముందస్తుకు వెళ్లి భంగపడింది. ఒక సారి అయితే చంద్రబాబు నాయుడిపై అలిపిరిలో నక్సలైట్లు దాడి చేసిన తర్వాత ముందస్తుకు వెళ్లింది. తనపై నక్సలైట్ల జరిపిన దాడి కలిసి వస్తుందని, తనకు అధికారం తప్నదని చంద్రబాబు నాయుడు చాలా ధీమాగా కూడా ఉన్నారు. అప్పట్లో ఇంటిలిజెన్సీ నివేదికలు కూడా చంద్రబాబు నాయుడు గెలుపు ఖాయమని తెల్చాయి. తీరా ఎన్నికలు వచ్చే సమయానికి ప్రజల తీర్పు మరోలా ఉంది. చంద్రబాబు నాయుడితో విసిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.

దేశంలో 1978 సంవత్సరం దాకా లోక్‌ సభ - శాసనసభలకు ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే ముందస్తు ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. తొలిసారిగా 1983 సంవత్సరంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. దానికి ఏడాది ముందు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి కారణం రాష్ట్రంలో ఎన్టీఆర్ బలపడక ముందే ఎన్నికలు జరపాలని అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి నిర్ణయించారు. అయితే పార్టీ పెట్టిన సంవత్సరంలోపే ఎన్టీఆర్ తెలుగు వారి అభిమానాన్ని పొంది అఖండ మెజార్టీతో విజయం పాధించారు. ఆ తర్వాత అవే ముందస్తు ఎన్నికలు ఎన్టీఆర్‌ కు కలిసిరాలేదు. 1990 మార్చి నెలలో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎన్టీఆర్ మాత్రం ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004 సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌ పేయి కూడా తన మిత్రుడు ఎల్.కె.అద్వానీ సలహాతో ముందస్తుకు వెళ్లారు. అయితే ఆయన పరాజయం పాలయ్యారు. దీన్ని బట్టి చూస్తే ముందస్తు ఎన్నికలు అందరికీ అన్ని విధాల కలిసి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ అనుభవాలను చూసే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను ముందస్తుకు వెళ్లనని చెబుతున్నారు. చివరి ఆరు నెలలైనా అధికారాన్ని సంపూర్ణంగా అనుభవించాలన్నది ఆయన కోరికగా తెలుస్తోంది.