Begin typing your search above and press return to search.

తెల్లవారుజామున వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్

By:  Tupaki Desk   |   6 Oct 2019 5:01 AM GMT
తెల్లవారుజామున వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్
X
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాచలం మండల ఎంపీడీవో సరళపై దాడి చేసిన కేసు విషయంలో పోలీసులు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు..

కోటంరెడ్డితోపాటు ఆయన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని, దాడి చేసేందుకూ ప్రయత్నించారని నిన్న వెంకటాచలం ఎంపీడీవో సరళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ జరిపి, కోటంరెడ్డి దాడి చేశారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని తేల్చారు. ఆపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో జీవీఆర్ కృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డిల లేఔట్ కు వాటర్ కనెక్షన్ ఇచ్చే విషయమై ఎంపీడీవో, కోటంరెడ్డి మధ్య వివాదం తలెత్తిందన్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్, చట్టం ముందు అందరూ సమానమేనని, అనుచితంగా ప్రవర్తించే వారు ఎవరైనా ఉపేక్షించ వద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్ కు స్పష్టం చేయడంతో ఆపై కోటంరెడ్డి అరెస్ట్ కు పోలీసులు కదిలినట్టు తెలుస్తోంది.

శనివారం రాత్రి నుంచి కోటంరెండ్డి ఇంటిదగ్గర పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాత్రంతా ఎదురుచూసిన పోలీసులు తెల్లవారుజామున శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తాను ఏ తప్పు చేయలేదని.. కొందరు రాజకీయం చేస్తున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. విచారణలో నిజాలు వెలుగుచూస్తాయని అన్నారు.

ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఆదివారం రాత్రి జమీన్ రైతు వారపత్రిక అధినేత డోలేంద్ర ప్రసాద్ మీద కూడా కోటంరెడ్డి దాడి చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కూడా పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.మీడియాపై దాడి చేసిన కోటంరెడ్డి వైఖరికి నిరసనగా మీడియా సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేశాయి. దీనిపై నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కోటంరెడ్డిపై ఏపీ సీఎం జగన్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన అరెస్ట్ కు ఆదేశించినట్టు తెలిసింది.