Begin typing your search above and press return to search.

తెలుగు నాట‌.. ముంద‌స్తు ఎన్నిక‌లు.. ఫ‌లితం ఏంటి? అధికార పార్టీల ప‌రిస్థితేంటి?

By:  Tupaki Desk   |   19 March 2022 2:30 AM GMT
తెలుగు నాట‌.. ముంద‌స్తు ఎన్నిక‌లు.. ఫ‌లితం ఏంటి? అధికార పార్టీల ప‌రిస్థితేంటి?
X
ముంద‌స్తు ఎన్నిక‌లు! అటు తెలంగాణ‌లోనూ.. ఇటు ఏపీలోనూ విస్తృతంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. తెలంగాణ‌లో బీజేపీ నేత‌లు, కాంగ్రెస్ నాయ‌కులు.. ముంద‌స్తు మాట మాట్లాడుతున్న విష‌యం తెలిసిందే. ఏపీలోకి వ‌చ్చే స‌రికి.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌డిచిన ఆరు మాసాలుగా ఈ పాటే పాడుతున్నారు. ముంద‌స్తు వ‌స్తుంది.. రెడీగా ఉండండి! అంటూ.. త‌మ్ముళ్ల‌కు ఆయ‌న పిలుపునిస్తున్నారు. మ‌రోవైపు.. తెలంగాణ‌లోనూ.. బీజేపీ నాయ‌కులు ఢిల్లీ నుంచి వ‌స్తున్న సందేశాల‌తో కేసీఆర్ స‌ర్కారుపై తీవ్ర‌స్తాయిలో క‌దం తొక్కుతున్నారు. వారు చేస్తున్న హ‌డావుడి అంతా కూడా.. ముంద‌స్తును దృష్టిలో పెట్టుకునే చేస్తున్నార‌ని తెలుస్తోంది.

ఒక‌వేళ‌.. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే.. ఏపీ, తెలంగాణ‌ల్లో ఎవ‌రికి లాభం.. ? అధికార పార్టీల స‌త్తా బ‌య‌ట ప‌డుతుందా? మ‌ళ్లీ అధి కారం ద‌క్కించుకుంటాయా? అనేది ఆస‌క్తిగా మారింది. ఈ క్ర‌మంలో గ‌త హిస్ట‌రీని తీసుకుంటే.. 2018లో జ‌రిగిన తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో మాత్ర‌మే అధికార పార్టీ విజ‌యం ద‌క్కించుకుని.. మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చింది. మిగిలిన సార్ల‌లో మాత్రం..అధికార‌ పార్టీలు డింకీలు కొట్టాయి. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి తీసుకుంటే.. నాలుగు సార్లు ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చాయి. వాటిలో ఒకే ఒక్క‌సారి.. అది కూడా తెలంగాణ‌లోనే అధికార పార్టీ తిరిగి పాల‌నాప‌గ్గాలు చేప‌ట్టింది.

మిగిలిన సార్లు ప్ర‌తిప‌క్షాలు అధికారంలోకి వ‌చ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1983లో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. అప్ప‌ట్లో కొత్త‌గా పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ను ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా చేసేందుకు కాంగ్రెస్ స‌ర్కారు ముంద‌స్తుకు వెళ్లింది. కేవ‌లం ఎనిమిది మాసాల ముందు.. అంటే.. ఆగ‌స్టులో జ‌ర‌గాల్సిన ఎన్నిక‌ల‌ను జ‌న‌వ‌రిలోనే వ‌చ్చేలా చ‌క్రం తిప్పింది. దీంతో అన్న‌గారు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా చేయాల‌ని ప్ర‌య‌త్నించినా. కాంగ్రెస్ వ్యూహం బెడిసి కొట్టి.. అన్న‌గారు దిగ్విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. అన్న‌గారే ముంద‌స్తుకు వెళ్లిన ప‌రిస్థితి వ‌చ్చింది. 1985లో 202 సీట్లు గెలిచిన టిడిపి ముందస్తు ఎన్నికలకు వెళ్లింది.

1990 మార్చి వరకు ప్రభుత్వానికి సమయం ఉన్నప్పటికీ నాలుగు నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేశారు ఎన్టీఆర్. ఆ తర్వాత తర్వాత వచ్చిన ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. 2003 అక్టోబర్‌ 1న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై తిరుపతి సమీపంలోని అలిపిరి వద్ద నక్సల్స్‌ క్లైమోర్ మైన్స్ పేల్చి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌ చంద్రబాబు పై సానుభూతిని తీసుకువచ్చింది. తనకు ఇది కలిసి వస్తుందని బలంగా నమ్మిన చంద్రబాబు... కాంగ్రెస్‌కు అధికారం ద‌క్క‌కుండా చేయాల‌ని భావించి.. 2004 వరకు అసెంబ్లీ గడువు ఉన్నప్పటికీ 2003 నవంబర్ లోనే ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న కూడా ఓడిపోయారు.

ఈ క్ర‌మంలో 2018లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసుకుని.. ముంద‌స్తుకు వెళ్లారు. త‌న‌ప్ర‌భు త్వంపై విప‌క్షాలు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నాయ‌ని.. ప్ర‌తి విష‌యాన్నీ న్యాయ‌స్తానంలోకి తీసుకువెళ్లి యాగీ చేస్తున్నాయ‌ని.. ఆయ‌న భావించి ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు కొన్ని స‌మీక‌ర‌ణ‌లు క‌లిసి వ‌చ్చాయి.(కాంగ్రెస్‌తొ పొత్తు పెట్టుకున్న చంద్ర‌బాబు ను బూచిగా చూపించి..) దీంతో ముంద‌స్తులో విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఇప్పుడు మాటేంటి?

మ‌ళ్లీ ఇప్పుడు తెలంగాణ‌లో ముంద‌స్తు వస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. డిసెంబర్ 22, 2021 ఢిల్లీలో జరిగిన తెలంగాణ బీజేపీ నేతల భేటీలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రస్తావించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండాలని తమ పార్టీ నేతలకు సంకేతాలిచ్చారాయన. ఇదే విష‌యాన్ని పార్టీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా కూడా ప్ర‌స్తావించారు. ఏపీలోనూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇదే చెబుతున్నారు. అయితే.. వీరు చెబుతున్న‌ది నిజ‌మో.. కాదో.. అనేవిష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఒక కీల‌క విష‌యం మాత్రం చ‌ర్చ‌గా మారింది. ఇప్ప‌టికిప్పుడు లేదా మ‌రికొన్ని నెల‌ల‌కు ముంద‌స్తు వ‌చ్చినా.. అధికార పార్టీల‌వైపు ప్ర‌జ‌లు నిల‌బ‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.