Begin typing your search above and press return to search.

ముందస్తు వస్తే.. చంద్రబాబు కు ఇక్కట్లే!

By:  Tupaki Desk   |   5 Jan 2018 5:15 AM GMT
ముందస్తు వస్తే.. చంద్రబాబు కు ఇక్కట్లే!
X
అసెంబ్లీ ఎన్నికలకు కూడా ముందస్తు గంట మోగవచ్చుననే వార్తలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ముందస్తు ఎన్నికల గురించి ఢిల్లీనుంచి సమాచారం వచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. షెడ్యూలు కంటె కొన్ని నెలలు ముందుగా.. అంటే ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదనేది ప్రస్తుతం రాజకీయ నాయకుల వద్ద వినిపిస్తున్న మాట. వేర్వేరు కారణాల నేపథ్యంలో మోడీ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లుగా కేసీఆర్ కు సమాచారం అందినట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే గనుక.. తెలంగాణ అసెంబ్లీకి కూడా ముందస్తు ఎన్నికలకే వెళ్లాలని వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీ పరిస్థితి ఏమిటి? అనే విషయంలో అనేక సంశయాలు రేగుతున్నాయి. ముందస్తు ఎన్నికలు అదికూడా.. 2018లోనే జరిగే లాగా షెడ్యూలు అయితే.. ఆ సమయానికి తాను కూడా బరిలోకి దిగడం చంద్రబాబునాయుడుకు ఆత్మహత్యా సదృశమే అవుతుంది. అయిదేళ్ల పాలనలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కోసం నిర్దిష్టంగా ఏ ఒక్క పని కూడా చేయలేకపోయిన... అత్యంత అసమర్థమైన ముఖ్యమంత్రిగా ఆయన మళ్లీ ఓట్లు అడుక్కుంటూ ప్రజల ఎదుటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.

ప్రస్తుతం చంద్రబాబునాయుడు ఖాతాలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం తప్ప.. మరొక్క మంచి పని లేదు. పోలవరం ప్రాజెక్టు నుంచి 2018లోగా గ్రావిటీతో నీళ్లు ఇస్తాం అని అంటున్నారే గానీ.. ఇప్పుడు కేంద్రం అనుసరిస్తున్న వైఖరి చూస్తే.. అది ఇంపాజిబుల్ అని అర్థమవుతుంది. అలాగే రాజధాని నిర్మాణం విషయంలో కూడా చంద్రబాబు సర్కారు పూర్తిగా ఫెయిలైంది. తాత్కాలిక భవనాల పేరిట వేల కోట్లు తగలేసి చేసిన వెలగపూడి సచివాలయం నిర్మాణాలు నాణ్యత లేకపోవడం కూడా చంద్రబాబుకు మైనస్ పాయింటే. అసలు రాజధానిలో అసలైన నిర్మాణాలకు ఇప్పటిదాకా కనీసం పునాదులు కూడా పడలేదు. ముందస్తు ఎన్నికల గంట మోగితే గనుక.. ఆలోగా నిర్మాణాల ప్రారంభం కాదు కదా.. కనీసం డిజైన్లు ఫైనలైజ్ కూడా అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఏ ఒక్కటీ ఫైనలైజ్ చేయకుండా.. ఏ పనినీ ప్రారంభించకుండా.. అయిదేళ్ల పాలనను ముగించి మళ్లీ ప్రజల వద్దకు ఓట్ల కోసం వెళితే వారు ఛీకొట్టే ప్రమాదం ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు.