Begin typing your search above and press return to search.

తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికలు?

By:  Tupaki Desk   |   10 July 2021 4:31 AM GMT
తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికలు?
X
ఓవైపు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంట్రీ.. మరోవైపు కొత్త పార్టీ వైఎస్ షర్మిల రంగప్రవేశంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. వీరందరూ పతాక స్థాయికి చేరకముందే.. ప్రభావం చూపకముందే రాష్ట్రంలో మరోసారి ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ తొలి టర్మ్ లో అసెంబ్లీని రద్దు చేసి మరీ 6 నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కామెంట్స్ రాజకీయవర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇది రాసిపెట్టుకోండి అని రేవంత్ రెడ్డి సవాల్ చేయడం చూస్తుంటే ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది.

వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికలకు వెళ్లడం ఖాయం అని.. ఇందులో మార్పు లేదని స్పష్టం చేశారు. అంటే దాదాపు ఏడాదిన్నర ముందుగానే ఎన్నికలకు వెళతారని అంటున్నారు. కానీ సగం పాలన చేసి ఎవ్వరైనా ఎన్నికలకు వెళ్లడం అసాధ్యం అని.. రేవంత్ మాటలు నమ్మబుద్ది కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

6 నెలలు ముందుగా అంటే వ్యూహాత్మకంగా కష్టంతో అంగీకరించవచ్చు. కానీ ఏడాదిన్నర ముందు ఎవ్వరూ అధికారాన్ని కోల్పోయి వెళ్లరు. పైగా రెండు సార్లు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ ఈ పనిచేస్తారని చెప్పడం కష్టం. మరి రేవంత్ రెడ్డి ఏ అంచనాతో ఈ వ్యాఖ్యలు చేశారో కానీ ఇప్పుడివి హాట్ హాట్ చర్చకు దారితీస్తున్నాయి.

ఇక కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి కేటీఆర్ ను సీఎం చేయరు అని రేవంత్ ఘంఠాపథంగా చెబుతున్నారు. వాస్తవానికి కేటీఆర్ ను సీఎం చేసేందుకు మార్పు చేర్పులు చేస్తారని.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని ప్రచారం ఉంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం విశేషం.

రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. రాసి పెట్టుకోవాలని.. బల్లగుద్ది చెబుతున్నానని కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని అనడం హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై అధికార టీఆర్ఎస్ ఎలా స్పందస్తుందనేది ఆసక్తి గా మరింది.

-కేటీఆర్, హరీష్ లకు రేవంత్ రెడ్డి కౌంటర్

ఇక నిన్న మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తనపై చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను టీడీపీ అయితే కేసీఆర్ ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు కేసీఆర్ అధ్యక్షుడు ఎలానో.. అలా తాను కాంగ్రెస్ కు అధ్యక్షుడిని అని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాని ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరే ముందు టీడీపీ పదవులన్నింటికి రాజీనామా చేశానని.. అసెంబ్లీ జీతం పడే ఖాతాను కూడా క్లోజ్ చేశానని రేవంత్ రెడ్డి తెలిపారు. రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీకే వెళ్లలేదన్నారు. టీఆర్ఎస్ లో ఉన్నవాళ్లంతా టీడీపీ వాళ్లే కదా అని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన వారు మంత్రులుగా కూడా ఉన్నారని అన్నారు. పార్టీ వల్లనే తనకు ఈ పదవి వచ్చింది కాబట్టి తన రాజీనామాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇచ్చానని రేవంత్ అన్నారు.

ఇక మంత్రి హరీష్ రావు కామెంట్లపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబే తెలంగాణ పీసీసీ పదవి ఇప్పించారని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. హరీష్ రావును మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. హరీష్ బ్రతుకే కాంగ్రెస్ అని అన్నారు. ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావును మంత్రిని చేసిందని కాంగ్రెస్ అన్నారు. హరీష్ రావుకు రాజకీయ భిక్ష పెట్టింది సోనియా, వైఎస్ఆర్ అని రేవంత్ రెడ్డి అన్నారు. గతి లేక టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ కాళ్లు పట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ కు టీడీపీయే దిక్కు అయ్యిందని రేవంత్ రెడ్డి అన్నారు.