Begin typing your search above and press return to search.

ఏపీకి వెళుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే చుక్కలే

By:  Tupaki Desk   |   11 Jun 2020 4:45 AM GMT
ఏపీకి వెళుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే చుక్కలే
X
లాక్ డౌన్ నిబంధనలు సడలించారు. అంతర్ రాష్ట్ర ప్రయాణాల అంశాన్ని కేంద్రం ఆయా రాష్ట్రాలకు వదిలేసింది. రెండున్నర నెలల పాటు సాగిన లాక్ డౌన్ కారణంగా.. ఏ ప్రాంతంలో ఉన్నోళ్లు ఆ ప్రాంతంలోనే ఉండిపోవటంతో నానా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. సడలింపుల నేపథ్యంలో.. ప్రయాణాలు పెట్టుకుంటున్న వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాల సంగతేమో కానీ.. ఏపీలోకి అడుగు పెట్టటం మాత్రం చాలా కష్టంగా మారింది. రోడ్డు కావొచ్చు రైలు కావొచ్చు.. చివరకు విమానంలో ఏపీకి వెళ్లినా టెస్టుల పేరుతో చేస్తున్న హడావుడి ప్రయాణికులకు అగ్నిపరీక్షగా మారింది.

లాక్ డౌన్ సడలింపులు ప్రకటించినా.. ఏపీలోకి అడుగు పెట్టటం అంత తేలికైన విషయంగా లేదు. తమ రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే స్పందన పాస్ తీసుకోవాలని చెబుతున్న ఏపీ సర్కారు.. అష్టకష్టాలుపడి ఆ పాస్ సాధించిన తర్వాత కూడా పరీక్షల మీద పరీక్షలు నిర్వహిస్తూ చుక్కలు చూపిస్తున్నారు. రోడ్డు మార్గాన ఏపీకి వెళితే..సరిహద్దు చెక్ పోస్టు దగ్గర వాహనాన్ని నిలిపేసి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించటంతో పాటు.. నాలుగు రోజుల కంటే ఎక్కువగా రాష్ట్రంలో ఉంటామంటూ హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు. అయితే.. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి కావటానికి గంటల కొద్దీ సమయం పడుతోంది.

ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లు.. విమాన మార్గాల్లో వచ్చే వారికైతే మరిన్ని సమస్యలు తప్పట్లేదు. రైళ్లలో వచ్చే వారికి రైల్వే స్టేషన్ల వద్ద అధునాతన ఐమాస్క్ క్వారంటైన్ మొబైల్ బస్సుల్ని పె్టి రెండు నిమిషాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాకుంటే.. తమ వంతు వచ్చేసరికి గంటల సమయం తీసుకోవటమే అసలు సమస్య.

కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చే వారికి మాత్రం తప్పనిసరిగా క్వారంటైన్ కు పంపటం కనిపిస్తోంది. కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి వచ్చే వారికి తప్పనిసిరగా క్వారంటైన్ సెంటర్లకు పంపుతున్నారు. అక్కడ నమూనాల్ని సేకరించి.. ఫలితాలు వచ్చిన దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నారు.

ఇక.. విమానాల్లో ఏపీలోకి అడుగు పెట్టిన వారికి.. పరీక్షల నిర్వహణ పేరుతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ వెయిట్ చేయిస్తున్నారు. దీంతో.. పెద్ద వయస్కుల వారు.. ఆరోగ్యసమస్యలు ఉన్న వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. పరీక్షలు నిర్వహించటం మంచిదే. కానీ.. ఆ పేరుతో గంటల కొద్దీ వెయిట్ చేయించటం ఏమిటన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. ఈపాసుల్ని తీసుకొని ఏపీలోకి అడుగు పెట్టటం అంత తేలికైన విషయం కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.