Begin typing your search above and press return to search.

కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్.. లోకేష్ వీడియోలే..

By:  Tupaki Desk   |   19 Jan 2019 10:41 AM IST
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్.. లోకేష్ వీడియోలే..
X
రిటర్న్ గిఫ్ట్.. తెలుగు ప్రజల్లో, రాజకీయాల్లో బాగా పాపులర్ అయిన పదం..తెలంగాణ ముఖ్యమంత్రిగా అఖండ మెజార్టీతో గెలిచిన కేసీఆర్.. తనను గత ఎన్నికల్లో ఓడగొట్టడానికి కంకణం కట్టుకొని పనిచేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించిన వాడిన పదమది.. బాబుకు వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించడం... ఆ గిఫ్ట్ ఏంటా అనేదానిపై చర్చోపచర్చలు.. కౌంటర్లు రావడంతో ఈ పదం హైలెట్ గా మారింది. బాబును ఓడించడమే రిటర్న్ అని అంతా భావించారు. కానీ దీనివెనుక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఆయన తాజాగా రిటర్న్ గిఫ్ట్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు.

ద్వారంపూడి రిటర్న్ గిఫ్ట్ గురించి మాట్లాడుతూ ‘ కూకట్ పల్లి లోధియా అపార్ట్ మెంట్ లో మంత్రి నారా లోకేష్ చేసిన అక్రమాల వ్యవహారాల వీడియోలను కేసీఆర్ త్వరలోనే బయటపెట్టే అవకాశం ఉందని’ బాంబు పేల్చారు. బహుశా చంద్రబాబుకు కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనేమోనని తన అనుమానం.. అభిప్రాయం వ్యక్తం చేశారు.

లోకేష్ మంత్రి కాకముందు లోధియా అపార్ట్ మెంట్ లోనే ఉండేవారని.. అక్కడ అక్రమాలు జరిగాయని.. అందుకు సంబంధించిన వీడియోలు కేసీఆర్ వద్ద ఉన్నాయేమోనని వాటిని బయటపెడుతాడు కావచ్చని ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేసీఆర్ తో జగన్ కలిశాడని ద్వారంపూడి వివరణ ఇచ్చారు. దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని నిప్పులు చెరిగారు. అధికారం కోసం నిన్నటివరకు బీజేపీతో జతకట్టి.. నేడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నారన్నారు. గతంలో వైఎస్ ఆర్ ను ఎదుర్కొంనేందుకు మహాకూటమి అంటూ కేసీఆర్ తో చంద్రబాబు జట్టుకట్టారని విమర్శించారు.