Begin typing your search above and press return to search.

పండుగ వేళ.. ఎక్కువమంది ఎం కొన్నారంటే?

By:  Tupaki Desk   |   8 Nov 2020 11:15 AM IST
పండుగ వేళ.. ఎక్కువమంది ఎం కొన్నారంటే?
X
పండగలు ఎప్పుడు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ.. ఈ ఏడాది పండుగులు రోటీన్ కు చాలా భిన్నం. ఓవైపు భయపెట్టే కరోనా. మరోవైపు ఆర్థిక అంశాలతో పాటు.. పండుగను పెద్దగా ఎంజాయ్ చేయలేని పరిస్థితి. గతంలో పండుగ అంటే చాలు.. స్నేహితులు.. బంధువులు.. ఇలా ఆ హడావుడే వేరుగా ఉండేది. ఊళ్లకు పెద్ద ఎత్తున వెళ్లేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా.. చాలా పరిమితంగా పండుగలు చేసుకునే పరిస్థితి.

ఈసారి చాలా పరిమితంగా పండుగలు చేసుకుంటున్న వేళ.. బట్టల కంటే కూడా ఎక్కువమంది మొబైల్ ఫోన్లు.. ఇంటికి సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేందుకు మొగ్గుచూపారట. సినిమాహాళ్లు లేని నేపథ్యంలో ఇంటిని సినిమాహాలు చేసుకునేందుకు మొగ్గుచూపారు. దీంతో ఇప్పటివరకు 32 అంగుళాల టీవీలు ఎక్కువగా అమ్ముడుబోయే స్థానే.. 42 అంగుళాల నుంచి 75 అంగుళాల వరకున్న టీవీల్ని కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపించటం గమనార్హం.

గతంతో పోలిస్తే.. హోమ్ థియేటర్ల అమ్మకాలు 50 శాతం పెరిగినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో పిల్లలకు ఆన్ లైన్ క్లాసుల నేపథ్యంలో ల్యాప్ టాప్ లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. వర్క్ ఫ్రం హోం ఉండటంతో.. ల్యాప్ టాప్ కొనుగోళ్లు భారీగా పెరగటమే కాదు.. ఒక దశలో కొరత కూడా చోటు చేసుకుంది. పనిలో పనిగా మొబైల్ ఫోన్లుకూడా భారీగానే అమ్ముడయ్యాయి.

ఒక అంచనా ప్రకారం జులై- సెప్టెంబరుతో ముగిసే త్రైమాసికానికి దేశంలో రికార్డుస్థాయిలో 5.43 కోట్ల సెల్ ఫోన్లు దిగుమతి అయినట్లు చెబుతున్నారు. టీవీల కొనుగోలు తర్వాత ఎక్కువమంది ఆసక్తి చూపించింది వాషింగ్ మెషీన్లు. పని మనుషుల కంటే ఇంట్లో పనిని తమకు తాము సొంతంగా చేసుకోవాలన్న ఆలోచనతో వాషింగ్ మెషీన్ల కు ఎక్కువ ప్రాధన్యత ఇచ్చారు. ఆసక్తికరమైన మరో అంశం.. డిష్ వాషర్లకు భారీ డిమాండ్ చోటు చేసుకుంది.ఇప్పటికి ఆర్డర్ చేసిన నెలకు కానీ డెలివరీ (కొన్ని మోడళ్లు) ఇవ్వలేని పరిస్థితి.