Begin typing your search above and press return to search.

పుష్కరాల్లోపు దుర్గమ్మకు వైభవం

By:  Tupaki Desk   |   30 Dec 2015 5:30 PM GMT
పుష్కరాల్లోపు దుర్గమ్మకు వైభవం
X
వచ్చే ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాలలోపు విజయవాడ కనకదుర్గ దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అవసరమైన మాస్టర్ ప్లాన్ ను అతి త్వరలోనే విడుదల చేయాలని కూడా భావిస్తోంది. మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతను ఇప్పటికే దేవాదాయ శాఖకు అప్పగించారు కూడా.

ప్రస్తుతం విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకోవడానికే క్యూ ఉంది. ఆ తర్వాత నేరుగా వెళ్లి మల్లేశ్వరస్వామిని దర్శించుకోవాలి. అయితే, మల్లేశ్వరస్వామి గుడికి వెళ్లే మార్గం ఇరుకుగా ఉండడంతో చాలామంది దుర్గమ్మను దర్శించుకుని తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లేశ్వరస్వామి గుడికి వెళ్లే దారిని విస్తరించడమే కాకుండా.. దుర్గా మల్లేశ్వరస్వామి ఇద్దరినీ దర్శించుకునేలా క్యూను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

గతంలో దుర్గ గుడిపై మూడు కోనేరులు ఉండేవి. ఇవి దుర్గ గుడికే ఎంతో పవిత్రతను, అందాన్ని తీసుకొచ్చాయి. కానీ ఆ కోనేరులను పూర్తిగా కప్పేసి అక్కడ పరిపాలనా భవనాలను నిర్మించారు. దాంతో పండుగ - నవరాత్రి సమయాల్లో భక్తులు దుర్గమ్మను దర్శించుకోవడం కష్టంగా మారుతోంది. దాంతో ఇప్పుడు ఆ పరిపాలనా భవనాలను అక్కడ తొలగించి మరో చోటికి మార్చాలని భావిస్తున్నారు. అదే సమయంలో, గతంలోని కోనేరులను పునరుద్ధరించాలని కూడా భక్తులుకోరుతున్నారు.

ఇప్పుడు కేవలం ఐదు వేల మందికి మాత్రమే అన్న ప్రసాదం అందజేస్తున్నారు. దీనిని 15 వేలకు విస్తరించాలని భావిస్తున్నారు. ఇందుకు మూడంతస్తుల భవనాన్ని నిర్మించనున్నారు. తిరుమలలో మాడ వీధులను వెడల్పు చేసినట్లే ఇంద్రకీలాద్రిపైనా నిర్మాణాలను తొలగించి వెడల్పు చేయాలని భావిస్తున్నారు. ఇంద్ర కీలాద్రిపై ప్రధాన గుడికి పక్కన ఆలయాలు మినహా మిగిలిన నిర్మాణాలను తొలగించాలని భావిస్తున్నారు. ఇంద్ర కీలాద్రికి చేరుకోవడానికి వన్ వేను ఏర్పాటు చేయడంతోపాటు శాశ్వత కళా కేంద్రం నిర్మించాలని కూడా భావిస్తున్నారు.