Begin typing your search above and press return to search.

కరోనాతో పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గిపోయాయి

By:  Tupaki Desk   |   10 Feb 2020 5:40 AM GMT
కరోనాతో పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గిపోయాయి
X
అంతర్జాతీయంగా చోటు చేసుకునే పరిణామాలతో నిత్యవసర వస్తువులైన పెట్రోల్.. డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు భగ్గుమనటమే కానీ.. తగ్గిన వైనం పెద్దగా కనిపించదు. ముడి చమురు భారీగా తగ్గినా కూడా భారత్ లో అందుకు తగినట్లుగా ధరలు తగ్గిన వైనం కనిపించదు. పెంచే విషయంలో చూపించే దూకుడు.. ధరల్ని తగ్గించే విషయం లో మాత్రం లేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. పెట్రోల్.. డీజిల్ ధరల విషయంలో యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే.. మోడీ సర్కారు వడ్డనే ఎక్కువన్న విషయం అందరికి తెలిసిందే.

అంతకంతకూ పెరిగి పోతున్న పెట్రోల్.. డీజిల్ ధరలను కాస్త తగ్గుముఖం పట్టేలా చేసిన క్రెడిట్ మాత్రం కరోనా వైరస్ ఖాతాలోకే చేరుతుంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా కారణం గా పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గటమే కాదు.. సామాన్యుడికి సైతం తగ్గినధర తెలిసేలా చేశాయని చెప్పాలి.

కరోనా వైరస్ కారణంగా చైనాలోని పలు నగరాలు.. పట్టణాల్లో రోజువారీ జీవితం చాలామేర స్తంభించిపోవటం.. కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమైపోతున్న వేళ.. పెట్రోల్.. డీజిల్ వినియోగం భారీగా తగ్గిపోయింది. నిత్యం కోట్లాది లీటర్ల పెట్రోల్.. డీజిల్ వినియోగించే చైనా లో ఇప్పుడీ ఇంధనాలకు డిమాండ్ తగ్గటం తో.. ఆ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ మీద పడింది.

ముడి చమురును భారీగా కొనుగోలు చేసే చైనా.. ఇప్పుడు కొనుగోలును తగ్గించటంతో.. ధర మీద ప్రభావం పడింది. దేశ రాజధాని లో పెట్రోల్ ధర రూ.72.45 ఉంటే డీజిల్ లీటరు ధర రూ.65.43గా ఉంది. హైదరాబాద్ లో మొన్నటి వరకూ లీటరు పెట్రోల్ రూ.80దాటిన స్థానే ఇప్పుడు రూ.77.08కు తగ్గితే.. డీజిల్ ధర ఏకంగా రూ.71.35 పడి పోయింది. విజయవాడ లో పెట్రోల్ ధర లీటరు రూ.76.63 ఉంటే.. డీజిల్ ధర లీటరు రూ.70.91గా ఉంది. మొత్తంగా చూస్తే.. కరోనా ప్రభావంతో లీటరు పెట్రోల్.. డీజిల్ మీద కనిష్ఠంగా మూడు రూపాయిలు.. గరిష్ఠంగా ఐదారు రూపాయిల వరకు తగ్గిందని చెప్పక తప్పదు.