Begin typing your search above and press return to search.

దుబ్బాక సీన్ తిరుపతిలో రిపీట్.. మరీ.. ఇంత అత్యాశా?

By:  Tupaki Desk   |   13 Nov 2020 9:00 AM IST
దుబ్బాక సీన్ తిరుపతిలో రిపీట్.. మరీ.. ఇంత అత్యాశా?
X
గుర్రం ఎగరా వచ్చు.. అన్నది రాజకీయాల్లో అప్పుడప్పుడు చోటు చేసుకునే కీలక పరిణామం. అలా అని.. ప్రతి సందర్భంలోనూ గుర్రం ఎగురుతుందనుకుంటే అంతకు మించిన తప్పు మరొకటి ఉండదు. దుబ్బాక ఎన్నికల్లో సాధించిన సంచలన విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతల సంగతి ఎలా ఉన్నా.. జాతీయస్థాయి నేతల్లో మాత్రం కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చినట్లుగా చెప్పక తప్పదు. అందుకు తగ్గట్లే.. సదరు నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని వింటే ఆశ్చర్యపోవాల్సిందే.

సొంత బలం అంటూ ఒకటి ఉంటుంది కదా? దాన్ని వదిలేసి మరీ ఇంతలా నేల విడిచి సాము చేయటమా? అన్న సందేహం కలుగక మానదు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం బీజేపీ నేతల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచేయటమే కాదు.. తమ బలం మీద వారికి కొత్త ఆలోచనలుపుట్టుకొచ్చినట్లుగా చెప్పక తప్పదు. తిరుపతిలో బీజేపీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం ఒకటి నిర్వహించారు. దీనికి ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దేవ్ ధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు స్థానిక బీజేపీ నేతల్లోనే కాదు.. కార్యకర్తల్ని విస్మయానికి గురి చేసింది.

తిరుపతిలో త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం రిపీట్ అవుతుందన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో చోటు చేసుకున్న పలు సమస్యల్ని చూడలేని స్థితిలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా విమర్శలు చేశారు. కరోనా వేళ అందరూ ముఖానికి మాస్కు తగిలించుకుంటే.. జగన్ మాత్రం కళ్లకు కూడా మాస్కులు వేసుకున్నట్లుగా వ్యాఖ్యానించారు. ఏపీలో జరుగుతున్న ఆరాచకాల్ని ఆయన చూడటం లేదని మండిపడ్డారు.

తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో దుబ్బాక ఫలితాన్ని రిపీట్ చేస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఏపీలో హిందూ ధర్మం ప్రమాదంలో పడిందన్నారు. ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. పస లేని విమర్శలు చేయటంతో పాటు.. ఏపీలో జగన్ ప్రభుత్వానికి ఉన్న పరపతిని పరిగణలోకి తీసుకోకుండా.. ఈ తరహా వ్యాఖ్యలతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సునీల్ దేవ్ ధర్ వ్యాఖ్యల్ని చూస్తుంటే.. దుబ్బాకలోని ప్రత్యేక పరిస్థితుల మీద కనీస అవగాహన కూడా ఆయనకు లేదన్న విషయం స్పష్టమవుతుందని చెప్పక తప్పదు.