Begin typing your search above and press return to search.

డీఎస్సీ 1998 : ఆ అభ్య‌ర్థి క‌థ విచిత్రం !

By:  Tupaki Desk   |   20 Jun 2022 7:00 PM IST
డీఎస్సీ 1998 : ఆ అభ్య‌ర్థి క‌థ విచిత్రం !
X
కొన్ని వింటే సంబ‌ర‌ప‌డ‌తాం.. కొన్ని వింటే ఆశ్చ‌ర్య‌పోతాం.. కొన్ని వింటే బాధ‌తో ఉన్న‌చోటే ఉండిపోతాం. ఏదేమ‌యినా కానీ ఇప్పుడు డీఎస్సీ 1998 ఫ‌లితాల‌కు సంబంధించి ఏపీ స‌ర్కారు ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. నాటి ఉద్యోగార్థుల ప‌రీక్ష‌లో ఉత్తీర్ణుల‌యి పోస్టింగులు లేకా అదేలేండి నియామ‌కాలు లేక ఉండిపోయిన వారంద‌రికీ తీపి వార్త ఒక‌టి చెప్పింది.

దీంతో నాటి ఉద్యోగార్థులంతా ఆనంద‌ప‌డుతున్నారు. కానీ ఓ అభ్య‌ర్థి మాత్రం త‌న దుర్భ‌ర జీవితం గురించి క‌నీసం స్పందించే స్థితిలో కూడా లేరు. ఆ విధంగా ఆ వ్య‌క్తి జీవితం ఇప్పుడు మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో..

ఆయ‌న పేరు అల్ల‌క కేదారీశ్వ‌ర‌రావు. డిగ్రీ పూర్త‌య్యాక అన్నామ‌లై వ‌ర్శిటీలో టీచ‌ర్ ట్రైనింగ్ కోర్సు కూడా పూర్తి చేసి, నాటి డీఎస్సీ కి అటెండ్ అయి పరీక్ష‌లో క్వాలిఫై అయ్యారు. ఈయ‌న ఊరు పాత‌ప‌ట్నం మండ‌లం పెద్ద‌సీది. అప్ప‌టి నుంచి ఆయ‌న ఎన్నో సార్లు ఉద్యోగం వ‌స్తుంద‌ని ఆశ‌తో ఎదురు చూసి చూసి ఆఖ‌రికి ఆటో డ్రైవ‌ర్ గా జీవనోపాధి వెతుక్కున్నారు. అటుపై బ‌ట్ట‌ల వ్యాపారం చేశారు.

ఏవీ క‌లిసి రాలేదు. నాన్న చ‌నిపోయాక త‌ల్లిని పోషిస్తూ ఊళ్లోనే ఉంటూ త‌న‌కు ఏనాటికి అయినా ఉద్యోగం వ‌స్తుంద‌ని అనేవారు. తోటి స్నేహితులు కూడా ఈయ‌న్ను నిరాశ ప‌రిచేవారు కాదు. ఆయ‌నతోనే ప‌రీక్ష రాసిన వారు కూడా ఇదే విధంగా ఏదో ఒక ప‌నిచేసుకుని కుటుంబాల‌ను పోషించారే త‌ప్ప ! మ‌రో దారి వారు చూసుకోలేదు. ఆఖ‌రికి అమ్మ‌ను వెంట‌బెట్టుకుని హైద్రాబాద్ వెళ్లిపోయారు. అయినా కూడా నిల‌దొక్కుకోలేక‌పోయారు ఆయ‌న.

అమ్మ అదృశ్యం కావ‌డంతో మ‌ళ్లీ స్వ‌స్థ‌లంకు తిరిగివ‌చ్చి, కొన్ని రోజుల‌కే మ‌తి స్థిమితం కోల్పోయారు. ఎవ్వ‌రు ఏమి ఇచ్చినా తిని బ‌తుకుతున్న ఆయ‌న‌కు ఈ సారి జాబ్ వ‌స్తుంద‌ని, నాటి జాబితాలో ఆయ‌న ఉన్నార‌ని పాత‌ప‌ట్నం వాసులు అంటున్నారు.

ఆయ‌న‌తో పాటే ఆ రోజు డీఎస్సీలో క్వాలిఫై అయిన వారిలో ఉన్న బాడాన ముకుంద రావు, గంగు మ‌న్మ‌థ రావు చెబుతున్న‌ది ఇదే ! ఇప్ప‌టికైనా ఆయ‌న క‌ల నెర‌వేరింద‌ని సంతోషించాలా లేదా ఆయ‌న ఈ వార్త విని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నార‌ని బాధ‌ప‌డాలో తెలియ‌ని సందిగ్ధావ‌స్థ‌లో ఉన్నారు నాటి ఆయ‌న స్నేహితులు. సినీ క‌వి ఆరుద్ర అంటారు ఓ చోట నువ్వెక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అంటే ఇదేనేమో!