Begin typing your search above and press return to search.

డీఎస్ సంచ‌ల‌న‌ కామెంట్లు.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   17 July 2021 11:30 AM GMT
డీఎస్ సంచ‌ల‌న‌ కామెంట్లు.. రీజ‌నేంటి?
X
రాజ‌కీయ సీనియ‌ర్ నాయ‌కుడు, ఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్ అద్య‌క్షుడిగా చ‌క్రం తిప్పిన ధ‌ర్మ‌పురి శ్రీనివాస్‌.. డీఎస్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 'నేను ఏ పార్టీలో ఉన్నానో అన్న విషయం నాకే తెలియడం లేదు. టీఆర్ఎస్‌ నుంచి నాకు ఆహ్వానాలు రావడం లేదు. నేను టీఆర్ఎస్‌ రాజ్యసభ ఎంపీనేనా? అన్న విషయాన్ని సీఎం కేసీఆర్‌నే అడగాలి' అని అన్నారు. ఒకే ఇంట్లో మూడు పార్టీలు.. అన్న అంశంపై ఆయన స్పందించారు. ఒకే ఇంట్లో మూడూ పార్టీలు.. అని తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చాలామంది ఎంపీల ఇళ్లల్లో భార్య ఒక పార్టీలో, భర్త ఇంకో పార్టీలో ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు.

పీసీసీ చీఫ్‌గా తాను కూర్చునే చక్రం తిప్పానని చెప్పారు. చిన్న కుమారుడు అర్వింద్‌ బీజేపీలోకి వెళ్లినప్పుడు వ్యతిరేకించలేద ని, కష్టపడి గెలిచి ఎంపీ అయ్యాడని తెలిపారు. కొడుకులిద్దరూ తనకు రెండు కళ్లలాంటి వారని, భవిష్యత్‌ను నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికుందని స్పష్టం చేశారు. పెద్ద కుమారుడు సంజయ్‌ సైతం రాజకీయాల్లో ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తనతో టీఆర్ఎస్‌లోకి వచ్చిన సంజయ్‌ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు చెప్పాడని డీఎస్‌ తెలిపారు. అయితే.. డీఎస్ నిర్వేదం వెనుక వ్యూహం ఉంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

త‌న పెద్ద కుమారుడు సంజ‌య్‌.. టీఆర్ ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్తున్నార‌నే విష‌యాన్ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పార ని.. పైకి టీఆర్ ఎస్‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌కుండానే ఆయ‌న ఆపార్టీని ఇర‌కాటంలోకి నెట్టార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. త‌మ‌ను, త‌మ కుటుంబాన్ని టీఆర్ ఎస్ ప‌ట్టించుకోవ‌డంలేద‌ని.. క‌నీసం త‌న‌కు ఆరోగ్యం బాగోన‌ప్పుడు కూడా టీఆర్ ఎస్ అధినేత త‌న‌ను ప‌ల‌క‌రించ‌లేద‌ని.. అలాంటప్పుడు ఆ పార్టీలో ఎందుకు ఉండాల‌నేది ఒక అంశ‌మైతే.. మ‌రోవైపు.. టీఆర్ ఎస్ మునిగిపోతున్న నావ‌గా ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను ప‌రోక్షంగా డీఎస్ కూడా చెప్పిన‌ట్టు అయింద‌ని.. ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. టీఆర్ ఎస్‌లో ఉంటే ఫ్యూచ‌ర్ లేద‌ని.. అందుకే త‌న పెద్ద కుమారుడు పార్టీ మారార‌ని.. డీఎస్ ప‌రోక్షంగా అంగీక‌రించిన‌ట్టు అయింది. మ‌రి డీఎస్ వ్యాఖ్య‌ల‌పై టీఆర్ ఎస్ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.