Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో డీఎస్ చేరిక ఖాయమే.. త్వరలో ముహూర్తం.

By:  Tupaki Desk   |   31 Jan 2022 9:36 AM GMT
కాంగ్రెస్ లో డీఎస్ చేరిక ఖాయమే.. త్వరలో ముహూర్తం.
X
ప్రస్తుతం అధికారికంగా సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అయితే అనధికారికంగా బీజేపీ, కాంగ్రెస్ లతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. సోనియాతో, అమిత్ షా సహా బీజేపీ పెద్దలతో భేటీలు అవుతూ పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు పార్టీ మారే విషయాన్ని వాయిదా వేస్తూ ఉన్నారు. పార్టీ మారితే అనర్హత వేటు ఖాయం కావడం.. టీఆర్ఎస్ రెడీగా ఉండడంతో ఆయన నిర్ణయాన్ని జాప్యం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ లో చేరాలని ఈనెలలోనే ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే డీఎస్ రాకను కాంగ్రెస్ లోని సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. కొందరు సీనియర్ల వ్యాఖ్యలతో ఇప్పుడు ఆ ప్రభావం పడనుంది.

తెలంగాణ పీసీసీ కొత్త పాలక వర్గం చేపట్టి నుంచి కాంగ్రెస్ లో రోజురోజుకు అనేక మార్పులు జరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టి నుంచి పార్టీ పటిష్టత కోసం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి ‘ఘర్ వాపసీ’ అనే ప్రొగ్రాం పెట్టామని, దీని ద్వారా పార్టీని వీడిన నాయకులందరినీ తిరిగి తెచ్చుకుంటామన్నారు. ఇందులో భాగంగా ఆయన పార్టీని వీడిన నాయకులు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో.. వారిని తిరిగి సొంత గూటికి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఒకప్పుడు ఉమ్మడి కాంగ్రెస్లో అగ్రనేతగా కొనసాగిన ధర్మవరపు శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్లోకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ ఇప్పటికైనా పుంజుకుంటుందా..? అన్న చర్చ సాగుతోంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పీసీసీ చీఫ్ గా చేసిన డీఎస్ ఇప్పుడు ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారోనన్ ఆసక్తి మొదలైంది.

రేవంత్ రెడ్డి టీం ఏర్పడిన తరువాత పార్టీలో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు సీనిర్లను కలుస్తూ వస్తున్నారు. అయితే పరోక్షంగా డీఎస్ తోనూ రేవంత్ రెడ్డి సంప్రదింపులు చేసినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ నేత ధర్మవరపు శ్రీనివాస్ ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్ అప్పట్లో రాజ్యసభ ఎంపీని కట్టబెట్టారు. అయితే టీఆర్ఎస్లో చేరిన కొత్తలో పార్టీ వ్యవహార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే రాను రాను ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. టీఆర్ఎస్ కు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ డీఎస్ కనిపంచలేదు. దీంతో కొంతకాలంగా ఆయన పార్టీని వీడుతారా..? అన్న వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఆయన టీఆర్ఎస్లో కొనసాగుతుండగా పెద్ద కుమారుడు సంజయ్ కాంగ్రెస్లో, చిన్న కుమారుడు బీజేపీలో ఎంపీగా ఉన్నారు.

ఈ క్రమంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే అని అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా వచ్చిన తరువాత రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది. దీంతో సొంత పార్టీ నాయకులే కార్యవర్గంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో మళ్లీ కాంగ్రెస్ పాతరోజులకు వెళ్లిపోయిందని భావించారు. ఇక హుజూరాబాద్ ఎమ్మెల్యేగా బీజేపీ తరుపున గెలుపొందని ఈటల రాజేందర్ స్వయంగా వెళ్లి డీఎస్ ను కలిశారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది.

రాజ్యసభ సభ్యత్వానికి.. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్లో చేరుతారని కొందరు మద్దతుదారులు అంటున్నారు. ఈ ఏడాది జూన్ వరకూ ఆయన రాజ్యసభ పదవీకాలం ఉంది. అప్పటిలోపే డీఎస్ కాంగ్రెస్ చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

తాజాగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డీఎస్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందట.. డీఎస్ సోనియాను కలవడంతో వెంటనే అనర్హత వేటు పడేలా చర్యలు తీసుకోవాలంటూ కొందరు ఎంపీ సీఎం కేసీఆర్ ముందు ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది.

మరోవైపు ఢిల్లీలోనే ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే డీఎస్ సోనియాతో భేటీ అయినట్లు సమాచారం. మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఢిల్లీకి రమ్మని చెప్పడంతో పార్టీలో జోరుగా చర్చలు ప్రారంభమయ్యాయి. దీంతో డీఎస్ చేరిక ఖాయమేనన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్క ఠాగూర్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఇతర నేతలతో చర్చించిన తరువాత డీఎస్ చేరే మూహూర్తం నిర్ణయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

డీఎస్ పైన అనర్హత వేటు కోసం రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ఫిర్యాదు చేయడానికి టీఆర్ఎస్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరితే ఏం చేయాలనే దానిపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. డీఎస్ కాంగ్రెస్ లో చేరిన మరుక్షణం అనర్హత వేటు కోసం ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

అయితే రేవంత్ రెడ్డి టీం నియమించిన తరువాత కూడా హూజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. అంతేకాకుండా డిపాజిట్లు కోల్పోయింది. దీంతో సొంత పార్టీ నాయకులే కొత్త పాలకవర్గంపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ సమయంలో డీఎస్ లాంటి నేతలు పార్టీలోకి వచ్చినా పరిస్థితి మారనుందా..? అన్న చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే టీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న నేతలు తమతో టచ్లో ఉన్నారని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు ఎవరెవరిని పార్టీలో చేర్చుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది.