Begin typing your search above and press return to search.

విమానంలో ప్రయాణికురాలి సీటుపై మూత్రం పోశాడు..!

By:  Tupaki Desk   |   1 Sep 2018 10:08 AM GMT
విమానంలో ప్రయాణికురాలి సీటుపై మూత్రం పోశాడు..!
X
స‌భ్య‌త సంస్కారాలు మ‌రిచిని ఓ ప్ర‌యాణికుడు చేసిన వీరంగం ఇది. తాగిన మ‌త్తులో అస‌హ్యంగా వ్య‌వ‌హ‌రించి ఆడ‌బిడ్డ‌ను ఆవేద‌న‌కు గురిచేసిన సంద‌ర్భం సంచ‌ల‌నంగా మారింది. మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు.. మరో ప్రయాణికురాలి సీటుపై మూత్రం పోసిన ఘ‌ట‌న‌ న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా విమానంలో ఆగస్టు 30న చోటు చేసుకుంది. ఈ విషయాన్ని మహిళా ప్రయాణికురాలి కూతురు ఇంద్రాణి ఘోష్ ట్విట్టర్ ద్వారా విమానయాన శాఖ - విదేశాంగ శాఖ మంత్రులతో పాటు ఎయిరిండియాకు ఫిర్యాదు చేసింది. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ ఘటనపై విమానయాన మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది.

జేఎఫ్‌ కే విమానాశ్రయం నుంచి ఆగ‌స్టు 30వ తేదీన బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ102లో మా అమ్మకు దారుణ అనుభవం ఎదురైందని పేర్కొంటూ ఇంద్రాణి ఘోష్ కేంద్ర విమానయాన శాఖ - విదేశాంగ శాఖ మంత్రులకు ట్విట్ట‌ర్‌ లో పేర్కొంది. ``మద్యం సేవించిన ఓ ప్రయాణికుడు తన ప్యాంటు విప్పి ఆమె కూర్చున్న సీటుపై మూత్రం పోశాడు! ఒంటరిగా ప్రయాణిస్తున్న మా అమ్మ ఇది చూసి నిశ్చేష్టురాలైపోయింది. ఎయిరిండియాకి కంప్లయింట్ చేసేందుకు కాల్‌ సెంటర్‌ కు ఫోన్ చేస్తే.. వెబ్‌ సైట్‌ లో ఫీడ్ బ్యాక్ రాయాలంటూ సందేశం వచ్చింది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల వీళ్లు మరింత రెచ్చిపోతారని మీకు తెలియదా? ఈ అసహ్యకరమైన పనులపై సదరు విమాన సంస్థకు ఫిర్యాదు చేస్తే ముందు ముందు మళ్లీ ఇలాంటివి జరగకుండా అడ్డుకోవచ్చు. త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకుంటార‌ని ఆశిస్తున్నాను`` అంటూ వ‌రుస ట్వీట్ల‌లో త‌న ఆవేద‌న‌తో కూడిన ఫిర్యాదు చేసింది.

కాగా ఈ ఫిర్యాదుపై విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా స్పందించారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ``దీనిపై సత్వరమే విచారణ చేపట్టి విమానయాన శాఖ - డీజీసీఏకి నివేదిక సమర్పించాలని ఆదేశించాం`` అని తెలిపారు. అయితే మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు.. ప్రయాణికురాలి సీటుపై మూత్రం పోయడంతో ఆమెకు మరో సీటు ఎయిరిండియా సిబ్బంది కేటాయించింది.