Begin typing your search above and press return to search.

డ్రగ్స్ మాఫియా.. ఇప్పుడు చిన్న కాఫీషాపులే టార్గెట్?

By:  Tupaki Desk   |   19 Sept 2019 12:22 PM IST
డ్రగ్స్ మాఫియా.. ఇప్పుడు చిన్న కాఫీషాపులే టార్గెట్?
X
దేశంలోని కొన్ని ప్రధాన నగారాల్లో డ్రగ్స్ వాడకం వ్యవహారాలు బయటకు వచ్చాయి. హైదరాబాద్ లో అయితే పెద్ద పెద్ద డ్రగ్స్ రాకెట్స్ పట్టుపడ్డాయి. రెండేళ్ల కిందట పలువురు సినిమా తారలు డ్రగ్స్ వినియోగదారులుగా వెలుగులోకి వచ్చారు. వారందరి గుట్టూ బయటపడింది. వారిని పోలీసులు విచారణకు పిలిపించారు. మొదట్లో సంచలనం రేపిన ఆ అంశం ఆ తర్వాత తెర మరుగు అయ్యింది.

డ్రగ్స్ వినియోగదారులు అయిన సినిమా వాళ్లు ఆ కేసుల నుంచి బయటపడినట్టే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ సంగతలా ఉంటే.. హైదరాబాద్ లోని కొన్ని స్కూల్స్ ను డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేసుకుంటోందనే టాక్ కూడా అప్పట్లోనే వినిపించింది.

ఆ వ్యవహారం పైనా పోలీసులు ఏమీ తెమల్చలేదు. ఇక ఇప్పటికీ నగరంలో డ్రగ్స్ పంపిణీ సాగుతూ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చిన్న చిన్న కాఫీ షాపులను మాధ్యమాలుగా వాడుకుంటూ కొన్ని ముఠాలు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నాయని తెలుస్తోంది.

వాటి ద్వారా అమ్మకాలు సాగిస్తే ఎవరికి అనుమానాలు రావని డ్రగ్స్ సరఫరా ముఠాలు వాటిని ఉపయోగించుకుంటున్నట్టుగా టాక్. డ్రగ్స్ విషయంలో ఎక్సైజ్ అధికారులు కొన్ని రోజుల పాటు సీరియస్ గా ఉన్నట్టుగా హడావుడి చేస్తారు. ఆ తర్వాత మళ్లీ నెలలు - సంవత్సరాల తరబడి అందుకు సంబంధించి అప్ డేట్స్ ఉండవు. ఎందుకు అలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. తెరచాటుగా డ్రగ్స్ అమ్మకాలు మాత్రం సాగుతూనే ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మరీ ఇప్పుడు అధికారులు ఎలా స్పందిస్తారో!