Begin typing your search above and press return to search.

గంజాయి మత్తులో భాగ్యనగరం చిత్తు

By:  Tupaki Desk   |   6 Nov 2020 10:00 AM IST
గంజాయి మత్తులో భాగ్యనగరం చిత్తు
X
భాగ్యనగరాన్ని గంజాయి మత్తు కమ్మేస్తున్నది. యువత ఈ మత్తులో జోగుతున్నారు. గంజాయి మాఫియాకు కోట్లకు పడగెత్తుతున్నది. యువత మాత్రం ఈ మత్తుమందు మోజులో పడి తమ జీవితాలను నాశానం చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్​ లో జరుగుతున్న గ్యాంగ్​ వార్​ లు, గొడవలకు గంజాయి వాడకమే కారణమని తెలిసి పోలీసులు విస్తుపోయారు. హైదరాబాద్​ శివారు ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగిపోతున్నది. మత్తు లో జోగుతున్న యువకులు నిత్యం గొడవలకు దిగుతున్నారు. మరో వైపు కొందరు సాఫ్ట్​వేర్​ ఉద్యోగులు సైతం గంజాయి వాడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. స్కూల్​ పిల్లల నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కుల వరకు గంజాయి బాధితులు ఉన్నారు. ప్రతిరోజు నగరంలోని ఏదో ఓ చోట గంజాయి కొద్దిమొత్తంలో పట్టుబడుతూనే ఉంది. అయినప్పటికీ భారీ స్థాయిలో గంజాయి హైదరాబాద్​కు వస్తున్నట్టు టాక్​

గొడవలకు మూలాలు వెతికితే షాకింగ్ నిజాలు

హైదరాబాద్‌లోని అఫ్జల్‌ఘంజ్‌, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌, అంబర్‌పేట్‌, ముసారాంబాగ్‌ ప్రాంతాలలో ఇటీవల నిత్యం గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ గొడవలకు అసలు కారణం గంజాయే అని తెలిసి పోలీసులు షాక్​కు గురవుతున్నారు. నగర శివారులోని బాలాపూర్ పీఎస్ పరిధిలో కూడా ఓ యువకునిపై హత్యాయత్నం జరిగింది. షాహిన్ నగర్‌కు చెందిన అమేర్ అనే యువకునిపై సద్దామ్ అనే రౌడీ షీటర్ గంజాయి మత్తులో కత్తులతో దాడి చేశాడు. ఈ దాడుల వెనక గంజాయి పాత్ర ఉన్నట్టు పోలీసులు తేల్చారు. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి గంజాయికి బానిసైన యువకులు మత్తులో హత్యలు, హత్యాయత్నాలకు కూడా వెనకాడటం లేదని అందువల్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.