Begin typing your search above and press return to search.

విజయవాడ కాలేజీల్లో డ్రగ్స్!

By:  Tupaki Desk   |   13 Oct 2019 8:26 AM GMT
విజయవాడ కాలేజీల్లో డ్రగ్స్!
X
కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. వీరిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా వీరు ఏదోలా యువ‌త‌ను డ్ర‌గ్స్ మ‌త్తులోకి దింపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా విజయవాడలో విద్యార్థులే టార్గెట్‌ గా వారిని డ్రగ్స్ మత్తులోకి దింపుతోంది. డ్రగ్స్ మాఫియా గుట్టును విజయవాడ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. ఈ మాఫియా గుంటూరు కేంద్రంగా డ్రగ్స్ మాఫియాను కంట్రోల్ చేస్తూ గుంటూరు - విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నత కుటుంబాలకు చెందిన పిల్లలతో పాటు కాలేజ్ విద్యార్థులు టార్గెట్‌ గా అమ్ముతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే విజ‌య‌వాడ టాస్క్‌ ఫోర్స్ పోలీసుల‌కు దీనిపై స‌మాచారం అంద‌డంతో వీరు వ‌లవేసి మొత్తం ఏడుగురు ముఠా స‌భ్యుల‌ను అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి పోలీసులు రెండున్నర కిలోల గంజాయితో పాటు మొత్తం 14 గ్రాముల డ్ర‌గ్స్ - ఒక టు వీల‌ర్ - 8 సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ రాజ‌ధాని కేంద్రంగా విజ‌య‌వాడ‌ - గుంటూరు న‌గ‌రాలు శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉన్న సంప‌న్న ప్రాంతాల‌కు చెందిన యువ‌త‌తో పాటు క‌ళాశాల విద్యార్థులు డ్ర‌గ్స్ మ‌త్తులో ప‌డి జీవితాల‌ను స‌ర్వ‌నాశనం చేసుకుంటున్నారు.

ఇదే అద‌నుగా ఇక్క‌డ వీరికి ముందుగా ఉచితంగా లేదా త‌క్కువ రేట్ల‌కు డ్ర‌గ్స్ అల‌వాటు చేస్తూ త‌ర్వాత వారి బ‌ల‌హీన‌త‌ల‌ను ఆస‌ర‌గా చేసుకుని ఎక్కువ రేట్ల‌కు డ్ర‌గ్స్ అమ్ముతున్నారు. ఇక తాజాగా విజ‌య‌వాడ టాస్క్‌ ఫోర్స్ పోలీసులు చేసిన దాడుల్లో శ్రీకాంత్‌ - అనంత్‌ కుమార్ అనే వ్య‌క్తులు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పోలీసులు చెప్పారు. టాంజానియా దేశానికి చెందిన లిస్వా శాబన్ - సూడాన్ దేశానికి చెందిన మహ్మద్ రసూల్ కూడా ఈ ముఠాలో ఉన్న‌ట్టు పోలీసులు చెప్పారు.

బెంగ‌ళూరులో రు.2 వేల‌కు కొనే డ్ర‌గ్స్ ఇక్క‌డ రు.4 వేల‌కు అమ్ముతున్న‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో వెల్లడైంది. కొద్ది రోజులుగా కొన‌సాగుతోన్న ఈ ముఠా కార్య‌క‌లాపాల‌పై పోలీసులు ఎట్ట‌కేల‌కు నిఘా పెట్టడంతో రెడ్ హ్యాండెడ్‌ గా పట్టుబడ్డారు.