Begin typing your search above and press return to search.

ఇదెక్కడి ఆరాచకం.. పట్టపగలు..నడి రోడ్డు మీద బీర్ తాగేయటమా?

By:  Tupaki Desk   |   3 Feb 2021 9:44 AM IST
ఇదెక్కడి ఆరాచకం.. పట్టపగలు..నడి రోడ్డు మీద బీర్ తాగేయటమా?
X
పార్టీ ఏదైనా కావొచ్చు. అందులో చేరటం.. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం హంగు.. ఆర్బాటంతో ఉంటాయి. దాన్ని తప్పపట్టాల్సిన అవసరం లేదు. తమ పార్టీకి ఉన్న బలాన్ని చెప్పేందుకు ఈ తరహా కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటారు. ఇలాంటివేళ.. కొందరు అత్యుత్సాహంతో వ్యవహరించే తీరు ఆయా పార్టీలకు కొత్త తలనొప్పులు తీసుకురావటమే కాదు.. విమర్శలతో తల పట్టుకునే పరిస్థితి వస్తుంది. తాజాగా అలాంటి పరిస్థితే బెజవాడలో నెలకొంది. అధికార పార్టీలో చేరేందుకు కొందరు కార్యకర్తలు ముందుకు రావటం.. అందుకు తగ్గట్లుగా ఏర్పాటు చేసిన కార్యక్రమం పక్కదారి పట్టింది.

కొందరు అత్యుత్సాహపు కార్యకర్తల వీరంగం ఏపీ అధికారపార్టీకి తలనొప్పిగా మారింది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు.. కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నడి రోడ్డు మీద కొందరు యువకులు వీరంగం వేశారు. కార్యక్రమానికి వెళ్లే దారులపైనే.. డివైడర్ పైన నిలుచొని బీర్ తాగటం.. మద్యం సీసాలను నేరుగా ఎత్తి పట్టేసి తాగేసిన తీరు ముక్కున వేలేసుకునేలా చేసింది.

అంతేనా.. మద్యం సీసాల్ని రోడ్ల మీదనే పగులకొట్టి బీభత్సం చేశారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్ల మీద ఇంతలా చేసిన వైనంతో వాహనదారులు.. స్థానికులు బిత్తరపోయారు. అరగంట పాటు సాగిన ఈ ఆరాచకంపై పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి వాటిని కట్టడి చేయకుంటే.. అధికారపార్టీ ఇమేజ్ దెబ్బ తింటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.