Begin typing your search above and press return to search.

ఎవ‌రీ ద్రౌప‌ది ముర్ము.. ఏమా క‌థ‌?

By:  Tupaki Desk   |   22 Jun 2022 3:15 AM GMT
ఎవ‌రీ ద్రౌప‌ది ముర్ము.. ఏమా క‌థ‌?
X
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూట‌మి త‌ర‌ఫున రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము ఎంపిక‌యిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీలో స‌మావేశ‌మైన బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు ద్రౌప‌ది ముర్మును త‌దుప‌రి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేసింది. ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ ధోబాల్, త‌దిత‌రులు స‌హా మొత్తం 20 మందిపై చ‌ర్చ జ‌రిగినా ద్రౌప‌ది ముర్మువైపే బీజేపీ మొగ్గుచూపింది. ఎన్డీఏ ప‌క్షాల‌న్నింటితోనూ చ‌ర్చించి ఆమెను ఎంపిక చేశామ‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా తెలిపారు.

ఈ నేప‌థ్యంలో ఎవ‌రి ద్రౌప‌ది ముర్ము అని దేశ ప్ర‌జ‌ల్లో ఆసక్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఒడిశాలోని మ‌యూర్ భంజ్ జిల్లా బైడ‌బోసిలో ముర్ము జ‌న్మించారు. రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించ‌క‌ముందు టీచ‌ర్ గా ప‌నిచేశారు. ఆ తర్వాత కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాారు. ఆ తర్వాత రాయ్‌రంగపూర్‌ నేషనల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ వైస్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. తర్వాత రెండు పర్యాయాలు ఒడిశా అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. బీజేపీ- బిజూ జనతాదళ్‌ కలిసి ఏర్పాటుచేసిన నవీన్‌ పట్నాయక్‌ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో 2000- 2004 మధ్య మంత్రిగా పనిచేశారు. 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్‌ గవర్నర్‌గా సేవలందించారు. ఆమెకు భర్త శ్యామ్‌ చరణ్‌ ముర్ము, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

2017 రాష్ట్రపతి ఎన్నికల్లో ఈమె పేరు ప్రధానంగా చర్చకు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో బిహార్‌ గవర్నర్‌గా ఉన్న ఎస్సీ నేత రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. విపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచిన కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హాకు దీటుగా ఒడిశాకు చెందిన ఆదివాసీ మహిళా నేతగా ఉన్న 64 ఏళ్ల ద్రౌపది ముర్మును బీజేపీ పోటీలో దించింది. ఎన్నికల్లో నెగ్గితే.. రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌప‌ది ముర్ము చరిత్ర లిఖించనున్నారు.