Begin typing your search above and press return to search.

ద్రౌపది ముర్ము : ఒక రోజు లేట్ గా బర్త్ డే గిఫ్ట్

By:  Tupaki Desk   |   21 Jun 2022 5:19 PM GMT
ద్రౌపది ముర్ము :  ఒక రోజు లేట్ గా బర్త్  డే గిఫ్ట్
X
ఆమె చాలా సాధారణ మహిళ. ఒడిషాలోని బైడపోసి గ్రామలో 1958 జూన్ 20న ద్రౌపది ముర్ము జన్మించారు. అంటే ఆమె పుట్టిన రోజు నిన్న అన్న మాట. ఒక రోజు లేట్ గా ఆమెకు బ్రహ్మాండమైన గిఫ్ట్ ని బీజేపీ అందించింది. జూన్ 21న రాత్రి బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ మీటింగ్ లో ద్రౌపది ముర్ము పేరుని రాష్ట్రపతి అభ్యర్ధిగా ఖరారు చేశారు.

ఇక ద్రౌపది ముర్ము టీచర్ గా తన జీవితాన్ని ప్రారభించారు. ఆ తరువాత బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలు అయి అందులో చేరారు. ఇప్పటికి పాతికేళ్ళ క్రితం ఆమె 1997లో ఒడిషాలోని రాయ్ రంగపూర్ జిల్లాలో తొలిసారి కౌన్సిలర్ గా నెగ్గారు. ఆ తరువాత రాయ్ రంగ్ పూర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయ్యారు.

ఇక 2000లో రాయ్ రంగ్ పూర్ నుంచి ఆమె ఎమ్మెల్యేగా నెగ్గారు. 2002 నుంచి 2004 వరకూ ఆమె బీజేడీ, బీజేపీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 2004 నుంచి 2009 వరకూ మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2015లో జార్ఖండ్ కి తొలి మహిళా గవర్నర్ గా నియమితులై పూర్తి కాలం పనిచేశారు.

ఇక పార్టీ పదవుల విషయం చూసుకుంటే మయూర్ భంజ్ జిల్లాకు బీజేపీ ప్రెసిడెంట్ గా మూడు సార్లు పనిచేశారు. అలాగే ఒడిషా బీజేపీకి ఎస్టీ విభాగం ప్రెసిడెంట్ గా చేశారు. ఎక్కడ పనిచేసినా చిత్తశుద్ధితో చేయడం ఆమె పేరుని పెంచింది. ఇక బీజేపీకి ఆమె వీరవిధేయురాలు. అదే విధంగా మరో చిత్రం ఈ సందర్భంగా చెప్పుకోవాలి.

రాష్ట్రపతి పదవికి ఆమె పేరు 2017లోనే వినిపించింది. నాడు రామ్ నాధ్ కోవింది తో పాటు పోటీ పడిన వారిలో ద్రౌపది ముర్ము కూడా ఉన్నారు. అయితే చివరికి ఆయన పేరు ఖరారు అయింది. నాడు తప్పిపోయినా ఎక్కవలసిన రాష్ట్రపతి భవనం మెట్లు అయిదేళ్లు ఆలస్యంగా అయినా ఆమెకు అదే దారి చూపించాయి.