Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్.. అసలు గుట్టు బయటపెట్టిన శాంతా బయోటెక్ అధినేత !

By:  Tupaki Desk   |   24 March 2020 1:10 PM IST
కరోనా వ్యాక్సిన్.. అసలు గుట్టు బయటపెట్టిన  శాంతా బయోటెక్ అధినేత !
X
కరోనా వైరస్.. ప్రపంచ దేశాలని వణికించేస్తున్న మహమ్మారి. గత ఐదు దశాబ్దాల్లో ప్రపంచాన్ని ఇంతగా భయపెట్టిన అంశం మరొకటి లేదు అంతే అతిశయోక్తి కాదు. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టి ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని భయపెడుతోంది. అయితే, ఈ వైరస్ లక్షణాలపైనే ఇంకా స్పష్టత లేదు. అలాగే దీనికి సరైన మందు కూడా లేదు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా తో 16,500 మంది ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 3.76 లక్షలకు చేరింది. ఇక దీనికి వైద్యం ఎలా చేయాలనే విషయంలో ఉన్న ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కేవలం కరోనా బారిన పడ్డ వారిలో ఉన్న జ్వరం - దగ్గు - శ్వాసలో ఇబ్బంది లాంటి లక్షణాల్ని బట్టి వాటికి తగ్గ మందులిస్తున్నారు. ఈ మందుల ప్రభావానికి తోడు రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్లు తట్టుకుని నిలబడుతున్నారు, మిగిలిన వారు ప్రాణాలు వదులుతున్నారు. అయితే, ఇంత ప్రమాదకర వైరస్‌ బయటపడి నాలుగు నెలలు కావస్తున్నా దీనికి మందు కనుగొనకపోవడమేంటి అని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ దీనికి వ్యాక్సిన్ కనుగొనేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

అయితే , కరోనా వైరస్ కు మందు కనుగొన్నారన్న వార్తల్లో నిజం ఉండకపోవచ్చు అని శాంతా బయోటెక్ అధినేత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి అంటున్నారు. హెపటైటిస్-బికి వ్యాక్సిన్ కనుగొని సామాన్య ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని కేవలం పాతిక రూపాయలకు అందించిన గొప్ప వ్యక్తి ఆయన. అమెరికాలో వెయ్యి డాలర్లకు ఈ వ్యాక్సిన్ అందిస్తున్న సమయంలో పాతిక రూపాయలకు ఇండియాలో ఇచ్చారు.

ఆయన కరోనా వైరస్ మీద తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ శాంతా బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదని ఆయన చెప్పారు. ఒక కొత్త వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేయడం అంత సులువు కాదని ఆయన అన్నారు. ఇందులో చాలా దశలుంటాయని.. ఈ ప్రక్రియకు దాదాపు ఐదేళ్లు సమయం పడుతుందని ఆయన వివరించారు. కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయాలంటే.. ముందు ఆ వైరస్‌ ను గుర్తించి.. దాని అవశేషాన్ని తీసుకుని దాన్నో మీడియడంలో పెట్టి ఎదిగేలా చేస్తారని, తర్వాత ప్యూరిఫై చేస్తారని.. ఈ ప్రక్రియకే దాదాపు ఏడాది సమయం పడుతుందని.. ఒకవేళ కరోనా కోసం శరవేగంగా పని చేసి ఉంటే ఈపాటికి ఈ ప్రక్రియ పూర్తయి ఉండొచ్చని.. ఆ తర్వాత వ్యాక్సిన్ తయారు చేసి ఎలుకల మీద ప్రయోగించి, ఈ వ్యాక్సిన్ సురక్షితమా కాదా అని తేల్చాల్సిన దశ ఉంటుందని తెలిపారు.

ఆ తరువాత దీన్ని మనుషులకు ఇచ్చి ప్రభావం ఎలా ఉంటుందో గమనించే దశ ఉంటుందని.. ఈ దశలకే నాలుగేళ్ల దాకా సమయం పడుతుందని.. ఆపై రెగ్యులేటరీ బోర్డుకు రికార్డులన్నీ సమర్పిస్తే వాళ్లు ఆమోద ముద్ర వేయడం.. వివిధ దేశాలు ఈ మందును ఆమోదించడం.. ఇవన్నీ జరగాలని.. ఈ దశలన్నీ లేకుండా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేశారు అనడం సరి కాదని.. ఇటువంటి ప్రచారాలన్నీ ఎవరు నమ్మవద్దు అని ఆయన తేల్చి చెప్పారు.