Begin typing your search above and press return to search.

డాక్టర్ సుధాకర్ కేసు ... ఛార్జిషీట్ వేసేందుకు సీబీఐకి గ్రీన్ సిగ్నల్

By:  Tupaki Desk   |   30 Sept 2021 3:06 PM IST
డాక్టర్ సుధాకర్ కేసు ... ఛార్జిషీట్ వేసేందుకు సీబీఐకి గ్రీన్ సిగ్నల్
X
విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన అనస్తీషియా వైద్యుడు డాక్టర్‌ కె.సుధాకర్‌ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సుధాకర్ పట్ల అధికారులు అనుచితంగా వ్యవహరించారన్న ఘటనపై దర్యాప్తు పూర్తి చేశామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. సంబంధిత కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉందని.. వారిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తామని సీబీఐ వివరించింది.

ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు చార్జిషీట్‌ దాఖలుకు అనుమతి ఇచ్చింది. అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామంటూ విచారణను అక్టోబర్‌ 24కి వాయిదా వేసింది. నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి అనస్థీషియా డాక్టర్ సుధాకర్‌ కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఆసుపత్రిలో గ్లౌజ్‌లు, మాస్కులు ఇవ్వలేదని ప్రశ్నించారు. అయితే తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే.. తనపై తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేశారని ఆయన ఆరోపణలు చేశారు. అతని మానసిక పరిస్థితి బాగోలేదని కొద్ది రోజులు విశాఖలోని మానసిక ఆసుపత్రిలో చికిత్స అందించారు.

ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విష‌యం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఘటనలో డాక్టర్‌ సుధాకర్‌ పట్ అధికారులు అమానుషంగా ప్రవర్తించారని ఏపీ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖతో పాటు ఓ వీడియోను కూడా పంపారు. దీనిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో వారు దర్యాప్తు పూర్తి చేశామని కోర్టుకు తెలిపారు. అయితే డాక్టర్ సుధాకర్ మే నెలలో గుండెపోటుతో కన్నుమూశారు.