Begin typing your search above and press return to search.

అమెరికన్లకు వార్నింగ్ ఇచ్చిన ఆ దేశ వైద్యుడు

By:  Tupaki Desk   |   2 July 2020 1:30 AM GMT
అమెరికన్లకు వార్నింగ్ ఇచ్చిన ఆ దేశ వైద్యుడు
X
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి.. అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేసేస్తోంది. దీనికి తోడు అమెరికన్ల పైత్యం కూడా మహమ్మారి జోరు మరింత పెరగటానికి కారణంగా మారింది. ముఖానికి మాస్క్ పెట్టుకోండిరా బాబు అంటే.. దేవుడు ప్రాణం ఇచ్చింది స్వేచ్ఛగా బతకటానికే తప్పించి ముఖానికి గుడ్డ కట్టుకొని బతకటానికి కాదంటూ వారు చెబుతున్న మాటలకు దిమ్మ తిరిగిపోయే పరిస్థితి.

అమెరికన్ల వైఖరితో ఆ దేశంలో ఇప్పుడు పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరగటమే కాదు.. తగ్గే అవకాశం కనుచూపు మేర కనిపించట్లేదు. రేపు ఏదైనా వ్యాక్సిన్ వస్తే తప్పించి.. అమెరికన్లను రక్షించే పరిస్థితి లేదు. ఇప్పటివరకూ 26.99 లక్షల కేసులు నమోదు కాగా.. 1.29లక్షల మంది ప్రాణాలు విడిచారు. ఇటీవల కాలంలో ఒక అంశంలో ఇంత మంది అమెరికన్లు మరణించటం ఇదే తొలి సారి.

ఇలాంటివేళ.. అమెరికాలో ఫేమస్ వైద్య నిపుణుడైన ఆంటోనీ ఫౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటకు అమెరికన్లు ఇచ్చే విలువే వేరు. వైట్ హౌస్ లో కరోనాను నియంత్రించే ప్రత్యేక దళంలో కీలక సభ్యుడుమాత్రమేకాదు.. అంటువ్యాధుల నివారణలో పోటుగాడి గా ఫౌచీకి మంచి పేరుంది. అలాంటి ఆయన.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల పై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితులు ఇలానే కొనసాగితే.. త్వరలో రోజు కు లక్ష పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇప్పటికి దేశ ప్రజలు గుంపులు గుంపులు గా ఉంటున్నారని.. మాస్కులు ధరించక పోవటం పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రోజుకు 40వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయని.. ఇలానే పోతే.. రానున్న కొద్ది రోజుల్లో రోజుకు లక్ష కేసులు నమోదు కావటం ఖాయమంటున్నారు. ఈ వ్యవహారం తనను తీవ్ర ఆందోళన కు గురి చేస్తుందన్నారు. ఈ మహమ్మారి కారణంగా రాబోయేరోజుల్లో ఎన్ని మరణాలు చోటు చేసుకుంటాయో తాను చెప్పలేనని చెప్పిన ఆయన.. ఆ సంఖ్య మాత్రం అమెరికన్ల మనసులకు తీవ్ర ఆవేదనను కలుగుజేస్తాయని పేర్కొన్నారు. మహమ్మారిని కట్టడి చేయాలంటే ముఖానికి మాస్కులు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.