Begin typing your search above and press return to search.

డోక్లాం క్రెడిట్‌.. అజిత్ థోవ‌ల్‌ దేనా!

By:  Tupaki Desk   |   30 Aug 2017 4:07 PM IST
డోక్లాం క్రెడిట్‌.. అజిత్ థోవ‌ల్‌ దేనా!
X
ప్ర‌పంచంలోనే రెండు అతి పెద్ద దేశాలైన భార‌త్‌, చైనాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసిన డోక్లాం స‌రిహ‌ద్దులో సైనిక మోహ‌రింపు వ్య‌వ‌హారం దాదాపు రెండు నెల‌ల త‌ర్వాత ఇటీవ‌ల ప‌రిష్కారం అయింది! ఈ వివాదంపై అగ్ర‌రాజ్యం అమెరికా స‌హా ప‌లు దేశాలు విస్మ‌యం వ్య‌క్తం చేశాయి. మీరే త‌గ‌వులాడుకుంటే ఎలా అనే ధోర‌ణిలో ఇరు దేశాల‌కూ స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశాయి. అయినా కూడా చైనా ప్ర‌భుత్వం స‌హా ఆ దేశ‌ మీడియా భార‌త్‌ను రెచ్చ‌గొడుతూ త‌గువును పెంచుతూ.. ర‌గ‌డ‌కే దారితీయాల‌న్న ధోర‌ణిని అవ‌లంబించాయి.

అయితే, అనూహ్యంగా ఈ వ్య‌వ‌హారానికి ఇప్పుడు తెర‌ప‌డింది. త్వ‌ర‌లోనే ప్ర‌ధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన ఉండ‌డం, ఇప్ప‌టి వ‌ర‌కు క‌స్సు బుస్సులాడిన చైనా డ్రాగ‌న్ వెన‌క్కి మ‌ళ్ల‌డం అంతా ఆసక్తిగా మారింది. సుమారు 73 రోజులపాటు ఉత్కంఠ రేపిన ఈ వివాదం.. భారత్‌ - చైనా - భూటాన్‌ ట్రై జంక్షన్‌ అయిన డోక్లాం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడానికి భారత్‌-చైనా అంగీకరించడంతో శాంతియుతంగా పరిష్కారం అయింది. అయితే, ఈ వివాదం సామ‌ర‌స్యంగా ముగియడంలో తెరవెనుక ఉన్నదెవరు? చైనా వంటి క‌ర‌డు గ‌ట్టిన దేశాన్ని క‌రిగించింది ఎవ‌రు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీద‌కి వ‌చ్చాయి.

వీటికి స‌మాధానంగా ఒకే ఒక్క‌రి పేరు వినిపిస్తోంది. ఆయ‌నే జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌. ఆది నుంచి డోక్లాంపై వితండవాదం చేస్తున్న చైనాతో ధోవల్‌, ఆయన బృందం చ‌ర్చ‌లు జ‌రిపింది. గత జూలై 27న బీజింగ్‌లో ధోవల్‌ చైనా స్టేట్‌ కౌన్సిలర్‌ యాంగ్‌ జీచితో తొలిసారి భేటీ అయి దౌత్య చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 'ఇది మీ భూభాగమా?'అని యాంగ్‌ ప్రశ్నించగా.. ఈ ప్రశకు ఏమాత్రం తొణక్కుండా 'ప్రతి వివాదాస్పద ప్రాంతం చైనాకే చెందుతుందా?' అని దోవల్‌ ప్రశ్నించినట్టు సమాచారం.

భూటాన్‌ భూభాగంలో రోడ్డు నిర్మించడం ద్వారా మూడు దేశాల ట్రైజంక్షన్‌లో చైనా స్టేటస్‌కో(య‌ధాత‌థ స్థితి)ని మార్చి వేసిందని దోవల్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. చారిత్రక ఒడంబడికలకు అనుగుణంగా భూటాన్‌ భద్రతను కాపాడాల్సిన భారత్‌కు ఉందని అన్నారు. అయితే, డోక్లాంకు బదులుగా 500 చదరపు కిలోమీటర్ల భూటాన్‌ భూభాగాన్ని తిరిగి ఇస్తామని చైనా ఆఫర్‌ చేసినా ఆయ‌న తిర‌స్క‌రించారు. అంతేకాకుండా ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవడం వల్ల ఎంతో లబ్ధ పొందుతాయనే విషయాన్ని ధోవ‌ల్ నొక్కి చెప్పారు. దీంతో చైనా ద‌ళాలు పంతం వీడి వెన‌క్కిమ‌ళ్లాయి. ఇక‌, ధోవ‌ల్‌ ని ఇప్పుడు అంద‌రూ హీరో క‌న్నా ఎక్కువ‌గా చూస్తున్నారు. రియ‌ల్ హీరో అంటూ సోష‌ల్ మాధ్య‌మాల్లో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.