Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు డబుల్ డెక్కర్ బస్సులు రానున్నాయా?

By:  Tupaki Desk   |   7 Nov 2020 4:40 PM IST
హైదరాబాద్ కు డబుల్ డెక్కర్ బస్సులు రానున్నాయా?
X
దాదాపు నలభై సంవత్సరాల క్రితం.. హైదరాబాద్ అన్నంతనే చార్మినార్.. ద్రాక్ష పళ్లు.. బిర్లామందిర్ మాత్రమే కాదు.. డబుల్ డెక్కర్ బస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేవారు. హైదరాబాద్ మహానగరానికి వచ్చే ప్రతి ఒక్కరు డబుల్ డెక్కర్ బస్సుల్ని ఎక్కటం ఒక పనిగా పెట్టుకునేవారు. హైదరాబాద్ విలక్షణతకు నిదర్శనంగా ఈ బస్సులు కనిపించేవి.

ఏమైందో ఏమో కానీ.. ఈ బస్సుల్ని పదేళ్ల క్రితం నిలిపివేశారు. కారణం తెలీదు. తాజాగా ఒక వ్యక్తి చేసిన ట్వీట్ కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించటం.. డబుల్ డెక్కర్ బస్సుల విషయంలో ఆసక్తిని ప్రదర్శించటంతో హైదరాబాద్ కు డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ రానున్నాయా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

డబుల్ డెక్కర్ బస్సులతో నగర అందాల్ని గుర్తు చేసుకుంటూ ఒకరు పోస్టు చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్.. తనకు డబుల్ డెక్కర్ బస్సులతో ఎన్నో మధురమైన జ్ణాపకాలు ఉన్నాయన్నారు. అబిడ్స్ లోని సెంట్ జార్జి గ్రామర్ స్కూల్ కు వెళ్లేటప్పుడు ఈ బస్సులో వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు.

అయితే.. ఈ బస్సుల్ని నగరం నుంచి ఎందుకు నిలిపివేశారో తనకు తెలీదని ట్వీట్ చేసిన ఆయన.. వీటిని తిరిగి తెచ్చేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా? పరిశీలించాలని రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ ను కోరిన నేపథ్యంలో.. డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ కు రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మంత్రి కేటీఆర్ స్వయంగా ఆసక్తిని చూపించిన తర్వాత మంత్రి పువ్వాడ ఆయన ఆసక్తిని వాస్తవ రూపంలోకి తేకుండా ఉంటారా చెప్పండి. చూస్తుంటే.. త్వరలో హైదరాబాద్ మహానగరంలో డబుల్ డెక్కర్ బస్సులు రీఎంట్రీ ఇవ్వటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.