Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప‌రువు తీస్తోన్న డ‌బుల్ బెడ్ రూం!

By:  Tupaki Desk   |   30 July 2019 5:01 PM GMT
కేసీఆర్ ప‌రువు తీస్తోన్న డ‌బుల్ బెడ్ రూం!
X
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం అభాసుపాలవుతోంది. ఈ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్ట్ ఇవ్వగా వారు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అటు కాంట్రాక్టర్లతో పాటు... ఇటు అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సర్కారు పేదవాళ్లకు రెండు గ‌దుల ఇళ్లు కట్టించాలన్న అసలు లక్ష్యం నీరుకారిపోతుంది. దీంతో రెండు గదుల ఇంటికి ఓనర్ అవ్వాలనుకుంటున్న‌ సామాన్యుడు క‌ల‌ కలగానే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఏమాత్రం నాణ్యత లేకుండా కట్టేస్తున్నారు. ఇవి చిన్న చిన్న వర్షానికి పేకమేడల్లా కూలిపోతున్నాయి.

కాంట్రాక్టర్లు కక్కుర్తితో ఇళ్ల నిర్మాణంలో నాసిరకం సామాగ్రి వాడుతున్నారు. ఇటు అధికారులు కూడా కాసులకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లు చేసిన పనికి ఓకే చెప్పేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. తాజాగా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ఈ ఇళ్ల నిర్మాణంలో జ‌రిగిన సంఘ‌ట‌న డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల్లో అవ‌క‌త‌వ‌క‌ల అంశాన్ని మ‌రోసారి హాట్‌టాపిక్‌గా మార్చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతెల‌బోరు గ్రామంలో ప్రభుత్వం కొంతమంది పేద‌ల‌కు డబుల్ బెడ్ రూమ్ పథకం కింద ఇళ్లు నిర్మించి ఇస్తోంది.

ఈ పేదలంతా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎప్పుడు పూర్తవుతాయి... తాము ఎప్పుడు గృహప్రవేశం చేస్తామని కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇళ్లు పూర్త‌వ్వ‌డం సంగ‌తి దేవుడు ఎరుగు... అప్పుడే అసలు ప్రమాదం ముంచుకు వచ్చేసింది. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూలిపోతున్నాయి. నిర్మాణం మధ్యలోనే ఇలాంటి సమస్యలు తలెత్తే.. రేపు ఇళ్లు పూర్తయ్యి గృహ ప్రవేశం చేసి... అందులో నివాసం ఉంటే అప్పుడు కూడా ఇదే పరిస్థితి తలెత్తితే తమ జీవితాలు ప్రమాదంలో పడక తప్పద‌ని వారంతా ఆందోళన చేస్తున్నారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ ఎస్ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక ప‌లు కొత్త జిల్లాల్లో స్థ‌లాల‌ను వెతికి మ‌రీ డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తోంది. అయితే దాదాపు స‌గానికి పైగా ఇళ్లు నాసిర‌కంగా నిర్మిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వానికి నివేదిక‌లు అందాయి. కొన్ని చోట్ల ల‌బ్ధిదారులు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నిర‌స‌న‌లు కూడా చేప‌ట్టారు. అయినా ప్ర‌భుత్వం కాంట్రాక్ట‌ర్లు - అధికారుల‌పై ఎలాంటి ? చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో మ‌ళ్లీ ష‌రా మామూలే అన్న‌ట్టుగా ప‌రిస్థితి ఉంది. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ సైతం ఈ ఇళ్ల నిర్మాణం ఓ ప్ర‌హ‌స‌నంగా జ‌రుగుతుండ‌డంతో అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నా... అక్క‌డితో స‌రిపెట్టేస్తున్నారు.