Begin typing your search above and press return to search.

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే రూ.5వేల జరిమానా?

By:  Tupaki Desk   |   28 Aug 2022 8:59 AM GMT
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే రూ.5వేల జరిమానా?
X
ఇండియా, పాకిస్తాన్ దేశాల్లోని వారే కాదు.. యావత్ క్రికెట్ ప్రపంచం ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ సాయంత్రం 7.30 గంటలకు జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రజలంతా టీవీలకు అతుక్కుపోవడం గ్యారెంటీ. ఇంతటి ఉద్విగ్నభరిత మ్యాచ్ ను అందరూ చూడాలని ఆరాటపడుతుంటే జమ్మూ కశ్మీర్లో మాత్రం వింత వాతావరణం నెలకొంది.

నేడు జరుగనున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మూకశ్మీర్ లోని ఎన్.ఐటీ శ్రీనగర్ విద్యార్థులను హెచ్చరించింది. హాస్టల్ లోని గదుల్లో మ్యాచ్ లు చూస్తే ఇన్ స్టిట్యూట్ నుంచి బయటకు పంపించడంతోపాటు రూ.5వేలు జరిమానా విధిస్తామని ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

మ్యాచ్ కు సంబంధించి ఎలాంటి పోస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. భారత్-పాక్ మ్యాచ్ ను గుంపులు గుంపులుగా చూడద్దని విద్యార్థులకు హెచ్చరించింది. విద్యార్థుల సంక్షేమం కోసమే తాము ఈ నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపింది.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో విద్యార్థులు తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని పేర్కొంది. ఇతర విద్యార్థులు ఉంటోన్న గదుల్లోకి వెళ్లకూడదని హెచ్చరించింది.

దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ను క్రీడా స్ఫూర్తితోనే చూడాలని.. ఇన్ స్టిట్యూట్, హాస్టల్ లో ఎటువంటి క్రమశిక్షణారాహిత్య చర్యలకు పాల్పడవద్దని సూచించింది. ఒకవేళ విద్యార్థులు ఇతర గదుల్లోకి వెళ్లి గుంపులుగా మ్యాచ్ చూస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమ ఆదేవాలను లెక్కచేయకుండా గుంపులుగా చూస్తే విద్యార్థులకు ఇకపై వసతి అందకుండా చేయడంతోపాటు రూ.5వేల రూపాయల జరిమానా విధిస్తామని పేర్కొంది.

గతంలో పాకిస్తాన్ తో జరిగిన టీ20 మ్యాచులో భారత్ ఓడిపోగానే ఆ ఇన్ స్టిట్యూట్ విద్యార్థులకు , ఇతర విద్యార్థులకు మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో కొన్ని రోజుల పాటు ఎన్ఐటీని మూసివేయాల్సి వచ్చింది.