Begin typing your search above and press return to search.

కేటీఆర్ పంచ్‌!.. మోదీ ప్ర‌చారం టైం వేస్టేన‌ట‌!

By:  Tupaki Desk   |   30 March 2019 8:13 PM IST
కేటీఆర్ పంచ్‌!.. మోదీ ప్ర‌చారం టైం వేస్టేన‌ట‌!
X
ప్రాంతీయ పార్టీల నేత‌లు వాడీవేడీ వాద‌న వినిపించ‌డంలో రాటుదేలార‌నే వాద‌న ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తోంది. గ‌తంలో ఏదో ఒక జాతీయ పార్టీ గొడుగు కింద సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవడం - అసెంబ్లీ ఎన్నిక‌లు వచ్చేస‌రికి త‌మ‌దైన శైలి ప్ర‌తాపం చూప‌డం మ‌న‌కు తెలిసిందే. అయితే కాలం మారింది. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో స‌త్తా చాటుతున్న వైనం కూడా స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో జాతీయ పార్టీ పైనా ప్రాంతీయ పార్టీలు సెటైర్లు సంధిస్తున్నాయి. వెర‌సి కేంద్రంలో అటు అధికారంలోనో - ఇటు ప్ర‌తిప‌క్షం గానో ఉంటున్న జాతీయ పార్టీలు...ఢిల్లీలో త‌మ ప్ర‌త్య‌ర్థుల‌తో పాటు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల‌తోనూ పోటీ ప‌డ‌క త‌ప్ప‌డం లేదు. అస‌లు ఆయా రాష్ట్రాల్లో అడుగుపెట్టాలంటే కూడా జాతీయ పార్టీల నేత‌లు ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తున్న ప‌రిస్థితులు కూడా చాలా స్ప‌ష్టంగానే క‌నిపిస్తున్నాయి.

ప్ర‌ధాని హోదాలో న‌రేంద్ర మోదీ మొన్న‌టికి మొన్న ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు... టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు త‌న‌దైన శైలిలో స్పందించారు. మా రాష్ట్రానికి ఎందుకొస్తారు? అస‌లు ఇక్క‌డ మీకేం ప‌ని? అంటూ నినదించారు. తాజాగా ఇప్పుడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మోదీ తెలంగాణ‌లోనూ అడుగుపెట్టారు. ఈ ప‌ర్య‌ట‌న‌పై అక్క‌డి అధికార పార్టీ టీఆర్ ఎస్ కూడా త‌న‌దైన శైలిలో స్పందించింది. అయితే చంద్ర‌బాబులా పెడ‌బొబ్బ‌లు పెట్ట‌డానికి బ‌దులుగా సెటైరిక్ విమ‌ర్శ‌ల‌తో మోదీని హేళ‌న చేసే య‌త్నం చేసింది. ఇటీవ‌లే ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటిన టీఆర్ ఎస్ తెలంగాణ‌లో ఇప్పుడు జ‌రుగుతున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఘ‌న విజ‌యం సాధిస్తామ‌ని గ‌ట్టి ధీమాతో ఉంద‌నే చెప్పాలి. ఈ ధీమానే వ్య‌క్తం చేయ‌డంతో పాటు అదే ధీమాతో అవ‌త‌లి వ‌ర్గంపై సెటైర్లు సంధిస్తోంది. ఇందులో భాగంగా నిన్న‌టి ప్ర‌ధాని మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌పై త‌న‌దైన శైలిలో స్పందించిన టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌... ట్విట్ట‌ర్ వేదిక‌గా మోదీ ప‌ర్య‌ట‌న‌ను - తెలంగాణ‌లో బీజేపీ ప్ర‌చారాన్ని అవ‌హేళ‌న చేసే య‌త్నం చేశారు.

మోదీ జీ టైమెందుకు వేస్ట్ చేసుకుంటారు? ఇక్క‌డ మీకెటూ ఓట్లు ప‌డ‌వు క‌దా... అంటూ కేటీఆర్ త‌న‌దైన శైలి సెటైర్లు పేల్చారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌ కు వ‌చ్చి టీఆర్ ఎస్‌ ను విమ‌ర్శించ‌డానికి మీ విలువైన స‌మ‌యాన్ని వెచ్చించ‌డం వృథా య‌త్నమ‌ని - పాల‌మూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్ర‌క‌టించ‌మ‌ని ఎన్నాళ్లుగానో కోరుతున్న ప్ర‌జ‌ల‌కు తీపి క‌బురు పంపితే స‌రిపోతుంది క‌దా అంటూ కేటీఆర్ సెటైర్లు సంధించారు. ఈ త‌ర‌హా విమ‌ర్శ‌ల‌ను టీఆర్ ఎస్ నేత‌లు బీజేపీపైనే కాకుండా కాంగ్రెస్ పై కూడా సంధించేందుకు సిద్ధంగానే ఉన్న‌ట్లు స‌మాచారం. మొత్తంగా త‌మ పాల‌న‌లోని రాష్ట్రంలో ఇత‌ర పార్టీలు ప్రచారం చేయ‌డానికి వీల్లేద‌న్న రీతిలో కేటీఆర్ మాట్లాడ‌టం నిజంగానే ఆస‌క్తి రేకెత్తించేదే. మ‌రి కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై అటు బీజేపీ గానీ - ఇటు కాంగ్రెస్ గానీ ఏమంటాయో చూడాలి.