Begin typing your search above and press return to search.

అలాంటోళ్లు తన పిల్లలు కాదని భారతమాత అంటే..?

By:  Tupaki Desk   |   27 Feb 2016 9:06 AM GMT
అలాంటోళ్లు తన పిల్లలు కాదని భారతమాత అంటే..?
X
పైత్యం ముదిరితే జేఎన్ యూలో ఇష్టారాజ్యంగా మాట్లాడే విద్యార్థుల మాటల్లానే ఉంటాయి. జేఎన్ యూలో అసలేం జరుగుతుందన్న విషయాన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లేశ మాత్రంగా లోక్ సభలో చెప్పటమే కాదు.. దానికి సంబంధించిన ఆధారాలు చూపించటంతో దేశం యావత్తు విస్తుపోయింది. దుర్గామత మీద జేఎన్ యూలో వేసిన పోస్టర్.. అందులో ఏం రాశారో చదివిన వాళ్లకు ఒళ్లు మండిపోయింది. అప్పటివరకూ విద్యార్థులు మాటలు.. వారి వాదనలన్నీ కూడా మేధోతనంతో జరుగుతున్నవిగా.. భావస్వేచ్ఛగా చూసిన చాలామంది.. స్మృతి మాటలు విన్నాక.. ఇదేం పోయే కాలం అంటూ మండిపడిన పరిస్థితి.

ఊహించని విధంగా తమ గుట్టు బయటపడిందన్న ఆవేదనో.. ఆక్రోశమో కానీ.. జేఎన్ యూ విద్యార్థులు తాజాగా చెలరేగిపోయారు. కేంద్రమంత్రి స్మృతి మీద విరుచుకుపడ్డారు. యూనివర్సిటీ విద్యార్థులు ఆమె పిల్లలు కాదన్న విషయాన్ని ఆమె తెలుసుకోవాలని.. ఆమెలాంటి తల్లి అవసరం లేదని జేఎన్ యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు అనంత్ ప్రకాశ్ విమర్శలు చేయటం గమనార్హం. లోక్ సభలో ఆమె చేసిన ప్రసంగం అంతా రాజకీయ అంశంగా ఆయన అభివర్ణించారు.

కేంద్రమంత్రి మాటలు విన్న తర్వాత.. ఇదంతా రాజకీయ అంశంగా భావిస్తున్నామని.. తాము కేంద్రమంత్రికి ప్రత్యర్థులుగా సదరు విద్యార్థి నాయకుడు తనకు తాను చెప్పుకున్నారు. ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ సభను నిర్వహించిన బ్యాచ్ లో ఈ అనంత్ ప్రకాశ్ నారాయణ్ కూడా ఒకరు. చేసిన పని గురించి చింతించటం కంటే కూడా తెంపరితనంతో అతగాడు చేస్తున్న వ్యాఖ్యలు విన్నప్పుడు ఒక సూటి ప్రశ్న అడగాలనిపిస్తుంది. కేంద్రమంత్రి తమకు తల్లిలాంటిది కాదని.. తమకు అలాంటి తల్లి అవసరం లేదని చెబుతున్న అతగాడ్ని.. భారతమాత తనకు వెన్నుపోటు పొడిచి.. ముక్కలు ముక్కలు చేయాలనుకుంటున్న వారిని కొడుకులుగా కాదనుకుంటే అనంత్ లాంటి బ్యాచ్ ఏం మాట్లాడుతుంది?