Begin typing your search above and press return to search.

మెస్సీ మాయను మిస్సవొద్దు..బహుశా ఇదే ఆఖరు

By:  Tupaki Desk   |   13 Dec 2022 11:30 AM GMT
మెస్సీ మాయను మిస్సవొద్దు..బహుశా ఇదే ఆఖరు
X
ప్రస్తుత తరంలో ఫుట్ బాల్ దిగ్గజాలు ఎవరంటే అర్జెంటీనాకు చెందిన లియోనల్ మెస్సీ, పోర్చుగల్ వీరుడు క్రిస్టియానో రొనాల్డో. ఇద్దరూ సమ వయస్కులు. సమఉజ్జీలు కూడా. ఇద్దరూ దాదాపు చివరి ప్రపంచ కప్. 37 ఏళ్ల రొనాల్డో తమ జట్టు క్వార్టర్స్ లో వెనుదిరగడంతో కన్నీటి పర్యంతమై వెనుదిరిగాడు. ఇక ప్రపంచ కప్ ఆడలేనంటూ పరోక్షంగా సంకేతాలిచ్చాడు. మిగిలింది మెస్సీ. అతడి జట్టు అర్జెంటీనా మంగళవారం అర్థరాత్రి 12.30కు ప్రపంచ కప్ సెమీస్ లో ప్రమాదకర క్రొయేషియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గనుక అర్జెంటీనా గెలిస్తే ఫైనల్ లో మెస్సీ విన్యాసాలు చూసే అవకాశం ఉంటుంది. ఓడితే గనుక మెస్సీకీ ఇది ప్రపంచ కప్ చివరి మ్యాచ్ గానే భావించవచ్చు. ఈ నేపథ్యంలో అభిమానులు నేటి రాత్రి మ్యాచ్ ను మిస్ కాకుండా చూడడం మంచిది. ఈ కప్ లో ఐదు మ్యాచ్‌లు ఆడిన మెస్సీ 4 గోల్స్‌ చేశాడు. మరో రెండు గోల్స్‌ కు సహకారం అందించాడు.

ఫ్రాన్స్ ప్లేయర్ ఎంబాపె తర్వాత రెండోస్థానంలో ఉన్నాడు. 2014లో అర్జెంటీనా ఫైనల్స్‌కు చేరినా.. ప్రపంచకప్‌ అందుకోలేదు. మెస్సీకి ఇది లోటుగా నిలిచింది. ఇప్పుడు మెస్సీకి దాదాపు 35 ఏళ్ల వయసు. దీంతో మరో ప్రపంచకప్‌ ఆడే సమయానికి అతడికి 40ఏళ్లు వచ్చేస్తాయి. ఫిట్‌నెస్‌ ప్రాధాన్యంగా సాగే సాకర్‌లో అప్పటి వరకు ఆడటం ఓ సవాలే. మరోవైపు ఈ ప్రపంచ కప్‌ చివరి ప్రపంచకప్‌ కావొచ్చేమో అని ఇటీవల మెస్సీ వ్యాఖ్యానించాడు. తాజాగా కోచ్‌ లియోనల్‌ స్కాలనీ దీనిపై స్పందించాడు. ''ప్రస్తుతం మెస్సీఆటతీరును ఎంజాయ్‌ చేస్తున్నాను. అతడు ఆటను కొనసాగిస్తాడో లేదో చూద్దాం. అతడు కొనసాగడం మాకు (అర్జెంటీనా జట్టుకు), ఫుట్‌బాల్‌ ప్రపంచానికి గొప్పవిషయం'' అని పేర్కొన్నాడు. ఇక 2018లో అంచనాలు లేకుండా అడుగుపెట్టి.. సంచలన ప్రదర్శనతో ఫైనల్‌ చేరినా క్రొయేషియాకు కప్పు చిక్కలేదు. ఫ్రాన్స్ ఆ జట్టును అడ్డుకుంది.

కసి తీర్చుకునే అవకాశం పోయినసారి తమ కల చెదరగొట్టిన ఫ్రాన్స్ పై కసి తీర్చుకునే అవకాశం క్రొయేషియాకు చిక్కింది. నేటి సెమీస్ లో నెగ్గితే ఆ జట్టు ఫైనల్స్ కు వెళ్తుంది. మరోవైపు అవతలివైపున ఫ్రాన్స్ .. బుధవారం రాత్రి మొరాకోతో తలపడతుంది. బలబలాల రీత్యా మొరాకోపై ఫ్రాన్స్ గెలవచ్చు. దీంతో మళ్లీ ఫైనల్లో ఫ్రాన్స్ -క్రొయేషియా తలపడే వీలుంది. అప్పుడు కసి తీర్చుకోవచ్చు. విచిత్రమేమంటే గత రెండు ప్రపంచకప్‌ల్లో (2014లో అర్జెంటీనా, 2018లో క్రొయేషియా) రన్నరప్‌గా నిలిచిన జట్లే నేడు సెమీస్ లో తలపడుతున్నాయి.

అర్జెంటీనా రెండు సార్లు (1978, 1986) విజేత కావడం గమనార్హం. చరిత్ర చూస్తే ప్రపంచ కప్ సెమీస్ లో ఆ జట్టు ఎప్పుడూ ఓడలేదు. కాగా, ఆరో ప్రపంచకప్‌ ఆడుతున్నక్రొయేషియా.. అసాధారణ ప్రదర్శన కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. గత ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో 3-0తో అర్జెంటీనాపై గెలిచిన ఆ జట్టు.. మరోసారి అదే ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది.

దక్షిణ అమెరికా ఆధిపత్యానికి గండి?తొలి సెమీస్ లో క్రొయేషియా గెలిస్తే ప్రపంచ కప్ లో దక్షిణ అమెరికా జట్టేదీ లేకుండా పోతుంది. అవతలి గ్రూప్ లో ఉన్న ఫ్రాన్స్ కు తోడు క్రొయేషియా యూరప్ జట్లు. మొరాకో ఆఫ్రికా జట్టు. అంటే అర్జెంటీనా ఒక్కటే దక్షిణ అమెరికా ఆశాదీపం. ఇక క్వార్టర్స్‌లో మరో దక్షిణ అమెరికా జట్టు బ్రెజిల్‌కు షాకిచ్చిన.. క్రొయేషియా ఇప్పుడు అర్జెంటీనాను ఓడిస్తే సంచలనమే. తద్వారా వరుసగా ఐదోసారి యూరప్ జట్టుకే ప్రపంచ కప్ అందే అవకాశాలుంటాయి. 2006 నుంచి ప్రపంచ కప్ యూరప్ జట్ల మధ్యనే ఉంది మరి.. .. ఇప్పుడు మెస్సి కలను అడ్డుకునేందుకు సిద్ధమైంది. ఆ జట్టులో కెప్టెన్‌ లూకా మోద్రిచ్‌ ప్రధాన ఆటగాడు.

ఇప్పటివరకూ టోర్నీలో అతను ఒక్క గోల్‌ కొట్టకున్నా, గోల్‌ చేయడంలో సాయపడకున్నా.. అతణ్ని తక్కువగా వేయలేం. మిడ్‌ఫీల్డ్‌లో చురుగ్గా కదులుతూ.. బంతిపై జట్టు నియంత్రణ కొనసాగేలా చూడడంలో అతనే కీలకం. అతనితో పాటు కొవాసిచ్‌, బ్రోజోవిచ్‌తో మిడ్‌ఫీల్డ్‌ పటిష్ఠంగా ఉంది. క్రమారిచ్‌, మార్కో, లోవ్రో, పెరిసిచ్‌, పెట్కోవిచ్‌, మిస్లావ్‌ కూడా సత్తాచాటేందుకు సై అంటున్నారు. గోల్‌కీపర్‌ డొమినిక్‌ లివకోవిచ్‌ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ప్రపంచకప్‌ల్లో క్రొయేషియా ఇప్పటివరకూ ఆడిన నాలుగు పెనాల్టీ షూటౌట్లలోనూ గెలిచింది. 2018లో ప్రిక్వార్టర్స్‌లో డెన్మార్క్‌పై, క్వార్టర్స్‌లో రష్యాపై, ఈ సారి ప్రి క్వార్టర్స్‌లో జపాన్‌పై, క్వార్టర్స్‌లో బ్రెజిల్‌పై షూటౌట్లోనే నెగ్గింది. ఆ నాలుగింటిలోనూ గోల్‌పోస్టుకు అడ్డుగోడలా నిలబడి డొమినిక్‌ జట్టును గెలిపించాడు. సెమీస్‌లో మెస్సీని అడ్డుకోవడంపై ఆ జట్టు ప్రధానంగా దృష్టి సారిస్తుందనడంలో సందేహం లేదు. బ్రెజిల్‌తో మ్యాచ్‌లో విజయమే కాకుండా, జట్టు ఆటతీరు కూడా క్రొయేషియా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారితీస్తే మాత్రం క్రొయేషియాకే ఎక్కువ విజయావకాశాలు ఉంటాయని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.