Begin typing your search above and press return to search.

'చింతామణి' పై వెనకడుగు తప్పదా ?

By:  Tupaki Desk   |   3 Feb 2022 4:40 AM GMT
చింతామణి పై వెనకడుగు తప్పదా ?
X
ప్రభుత్వం ఈ మధ్యనే నిషేధించిన చింతామణి నాకటంపై వెనకడుగు వేయక తప్పేట్లు లేదు. దాదాపు వందేళ్ల క్రితం సంఘసంస్కర్త కాళ్ళకూరి నారాయణరావు రాసిన చింతామణి నాటకంపై నిషేధం విధించాలని ఆర్యవైశ్యులు కొందరు ప్రభుత్వంపై ఎప్పటినుండో ఒత్తిడి పెడుతున్నారు. నిజానికి కాళ్ళకూరి రాసిన నాటకం అప్పట్లోని వేశ్యా వృత్తిని సంస్కరించాలని రాసింది. కాళ్ళకూరి రాసిన నాటకంలో ఎక్కడా అసభ్యత లేదు. నాటకం ఆధారంగా తీసిన చింతామణి సినిమాలో కూడా ఎక్కడా అసభ్యత లేదు.

అయితే కాలక్రమంలో పాత సినిమా పాటలను రీమిక్స్ పేరుతో కొత్తగా రిలీజ్ చేస్తున్నట్లు కాళ్ళకూరి రాసిన చింతామణి నాటకాన్ని 1990 ప్రాంతంలో అనేకమంది తమదైన పద్దతిలో తిరగరాశారు. ఆ నేపథ్యంలోనే కొన్ని పాత్రలను వ్యంగ్యంగా, అశ్లీలమైన డైలాగులతో నింపేశారు. ప్రాంతాలను బట్టి ప్రజలను రంజింపచేయాలనే ఆలోచనతోనే కొందరు తమ పైత్యాన్ని చొప్పించటంతో చివరకు చింతామణి నాటకం కాస్త ఆశ్లీలంగా తయారైంది.

ఈ నాటకాన్నే నిషేధించాలని ఆర్యవైశ్యులు డిమాండ్లు మొదలుపెట్టారు. నిజానికి ఈ నాటకాన్ని నిషేధించినా, నిషేధించకపోయినా ప్రభుత్వానికి వచ్చే లాభమూ లేదు నష్టమూ లేదు. ఆర్యవైశ్యులు అడిగారు కాబట్టి ప్రభుత్వం నిషేధించిందంతే. నిషేధం పడగానే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు కోర్టులో కేసు వేశారు. దాంతో కేసు విచారించిన కోర్టు కూడా వందేళ్ళుగా ఉన్న నాటకాన్ని ఎలా నిషేధిస్తారు ? అంటు ప్రభుత్వాన్ని నిలదీసింది.

గట్టిగా మాట్లాడితే అసలు రాష్ట్రంలో నాటక సమాజాలు ఎక్కడున్నాయి ? ఎంతమంది నాటకాలు ఆడుతున్నారా ? మన రాష్ట్రంలో ఎంతమంది నాటకాలు చూస్తున్నారు ? చింతామణి నాటకం గురించి ఇప్పటి తరంలో ఎంతమందికి తెలుసన్నదే అసలైన పాయింట్. నిషేధం డిమాండ్ చేసిన వారిలో, సిఫారసు చేసిన వారిలో, నిషేధించిన వారిలో అసలు ఎంతమంది కాళ్ళకూరి చింతామణి నాటకం చూశారో కూడా అనుమానమే. అలాంటిది ప్రభుత్వం నిషేధించటం, కోర్టులో కేసు వేయటం, విచారణలో ప్రభుత్వాన్ని కోర్టు నిలదీయటం చాలా స్పీడుగా జరిగిపోయింది. కోర్టు వ్యాఖ్యల ప్రకారం సుబ్బిశెట్టి పాత్రను తీసేస్తే ఇక నాటకంలో పదునే ఉండదు. విచారణలో చివరకు కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.