Begin typing your search above and press return to search.

సుప్రీంకోర్టుకే సవాల్ విసిరిన శివసేన

By:  Tupaki Desk   |   20 Aug 2016 10:39 AM GMT
సుప్రీంకోర్టుకే సవాల్ విసిరిన శివసేన
X
మహారాష్ట్రలో దహిహండి(ఉట్టికొట్టడం) కార్యక్రమంపై సుప్రీంకోర్టు కొన్నినిషేధాలు విధించిన నేపథ్యంలో సుప్రీం కోర్టుపై శివసేన పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హిందూ పండుగలపై అణచివేతలు - నిషేధాలు విధిస్తూ లక్ష్మణ రేఖ దాటవద్దని సుప్రీంకోర్టును హెచ్చరించింది. గణేశ్ ఉత్సవ్‌ - దహిహండి - నవరాత్రి ఉత్సవాలు తమ విశ్వాసాలకు చిహ్నమని పేర్కొన్న శివసేన... కోర్టులు ఈ అంశాల్లో లక్ష్మణ రేఖ దాటకూడదని సూచించింది.

ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, ప్రభుత్వానికి తన విధులు - ఏది మంచి - ఏది చెడు అనే అంశం తెలుసునని శివసేన పేర్కొంది. ప్రభుత్వంపై పెత్తనం చెలాయించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థలోని అన్ని చక్రాలూ ఊడిపోతాయని శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో ఈ రోజు సంపాదకీయం కూడా రాసింది.

కోర్టులు ప్రభుత్వాల పాత్ర పోషించాలనుకుంటే రాజకీయ బురదను ఎదుర్కోవడానికి కూడా రెడీ కావాలని శివసేన అందులో పేర్కొంది. ప్రభుత్వాల్లా కోర్టులే అన్ని నిర్ణయాలు తీసుకుంటే కుదరదని కుండ బద్ధలు కొట్టింది. ఇలాంటి ఫత్వాలు జారీచేస్తే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించింది. కాగా దహీ హండీ ఉత్సవంలో పాల్గొనేవారికి 18 సంవత్సరాలు పూర్తయిఉండాలని.. ఉట్టిని కూడా 20 అడుగులకు మించి ఎత్తున కట్టరాదని సూచించింది. బుధవారం సుప్రీం ఈ మేరకు సూచించగా శివసేన అప్పటి నుంచి రగులుతోంది. ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాదు.. తాజాగా సుప్రీంతో ఢీ అంటే ఢీ అంటూ సవాల్ విసిరింది. ఆ నిబంధనలతో సంబంధం లేకుండా దహీ హండీ నిర్వహించిన తీరుతామని చెబుతోంది.