Begin typing your search above and press return to search.

4 నెలల్లో 30వేల కోట్లు దానం... జెఫ్ బెజోస్ మాజీ భార్య దాతృత్వం !

By:  Tupaki Desk   |   17 Dec 2020 1:22 PM IST
4 నెలల్లో 30వేల కోట్లు దానం... జెఫ్ బెజోస్ మాజీ భార్య  దాతృత్వం !
X
డబ్బు .. ఎంత సంపాదించినా కూడా తనివితీరనిది. ఎంతటి డబ్బున్నవారైనా కూడా ఇంకా డబ్బు సంపాదించాలనే అనుకుంటారే తప్ప , ఇక చాలు అనుకోరు. అలాగే కోట్లకి కోట్లు కూడబెట్టినవారు ఇంకా సంపాదించాలి , కూడబెట్టాలి అని అనుకుంటారే తప్ప , ఎవరైనా ఇద్దాం అని అనుకోరు. కొంతమంది మాత్రం అలాంటి దాతృత్వాన్ని ప్రదర్శించి పేదలను ఆదుకొని ,నలుగురి చేతా ప్రశంసలు పొందుతారు. అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ తన సంపాదనను తాహతుకు మించి దానం చేసేశారు. జస్ట్ నాలుగు నెలల్లోనే ఆమె 4 బిలియన్ డాలర్లకు మించి ( మన కరెన్సీ లో 29,426 కోట్లు) దానం చేశారు.

ఫుడ్ బ్యాంక్స్, ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్స్ కోసం ఆమె ఈ మొత్తాన్ని వెచ్చించారు. ఆమెరికాలో ఆరోగ్యం, ఆహారం, ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయంగా 384 సంస్థలకు మెకెంజీ స్కాట్ నిధులు అందించారు. ఫుడ్ బ్యాంకులు, ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్స్‌కు 4.1 బిలియన్ డాలర్లను అందించినట్లు బ్లాగు ద్వారా తెలిపారు. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి విముక్తి, ఉపాధి శిక్షణ, న్యాయ సంరరక్షణ వంటి వాటికి కూడా నిధులను ఇచ్చినట్లు తెలిపారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సమానత్వం తదితరాలకు మద్దతుగా జులైలో 1.7 బిలియన్ డాలర్లను వెచ్చించినట్లు చెప్పారు.

కొన్నేళ్ళ క్రితం జెఫ్ బెజోస్-మెకెంజీల విడాకులు ప్రపంచంలోనే ఖరీదైన డైవర్స్‌ గా నిలిచాయి. ఆ తర్వాత అమెజాన్‌ లో వాటా దక్కింది. ప్రపంచ కుబేరుల జాబితాలో మెకెంజీ 18వ స్థానంలో ఉన్నారు. ఆమె సంపద ఈ సంవత్సరం రూ.23.6 బిలియన్లు పెరిగి... మొత్తంగా రూ.60.7బిలియన్లకు చేరింది. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.49,289 కోట్లు. ఇంతలా పెరగడానికి కారణం ఆన్ ‌లైన్ ఈ-కామర్స్ సంస్థ అమెజానే. దాని నుంచే ఆమెకు ప్రధానంగా ఆదాయం వస్తోందని బ్లూమ్ ‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. ప్రపంచంలోని ధనవంతులైన మహిళల్లో ఆమె మూడవ వ్యక్తిగా నిలుస్తారు. కరోనా మహమ్మారితో సతమతమవుతున్న అమెరికన్ల జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆమె కోరుకున్నారు.

స్కాట్ నుంచి విరాళాలు పొందిన వాటిలో ఉన్నత విద్యకు సంబంధించిన సంస్థలు 30కి పైగా ఉన్నాయి. వాటిలో చాలా వరకూ ట్రైబల్ కాలేజీలు, బ్లాక్ కాలేజీలు, యూనివర్శిటీలూ ఉన్నాయి. 40కి పైగా ఫుడ్ బ్యాంకులు డబ్బు పొందాయి. 50కి పైగా గుడ్ విల్ ఇండస్ట్రీస్ ఇంటర్నేషనల్ కూడా నిధులు పొందాయి. "మేమ్ గ్రాంట్ కావాలని అడగలేదు. కానీ, స్కాట్ టీమ్ మమ్మల్ని సంప్రదించింది. మాకు భారీగా డబ్బు ఇచ్చింది. ఫలితంగా మేము రోజూ 850 ఇళ్లకు... 2600 భోజనాలు పెట్టగలుగుతున్నాం" అని మీల్స్ ఆన్ వీల్స్ ఆఫ్ తంపా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్కాట్ కింగ్ తెలిపారు