Begin typing your search above and press return to search.

ఇలాంటి సీజనల్ వ్యక్తి ‘‘పెద్దన్న’’ అయితే ఎట్లా?

By:  Tupaki Desk   |   12 March 2016 5:01 AM GMT
ఇలాంటి సీజనల్ వ్యక్తి ‘‘పెద్దన్న’’ అయితే ఎట్లా?
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చక్రం తిప్పాలని తెగ ఆరాటపడిపోతూ.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని తహతహలాడిపోతున్న వివాదాస్పద నేత డోనాల్డ్ ట్రంప్ తన కంపు నోటితో మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. విదేశీ ఉద్యోగులకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు కల్పించే హెచ్ -1బి వీసా వ్యవస్థను తప్పు పట్టి వార్తల్లోకి వచ్చాడు. తాజాగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థుల చర్చలో పాల్గొన్న అతగాడు.. హెచ్-1బి వీసా వ్యవస్థను తప్పు పట్టటమే కాదు.. దీని కారణంగా అమెరికన్లు ఉద్యోగ అవకాశాలకు కోత పడుతుందని చెప్పుకొచ్చాడు.

రాజకీయనేతగా ఇన్ని మాటలు చెప్పుకొచ్చిన ట్రంప్.. పారిశ్రామికవేత్తగా చేసేందేమిటో చూస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే అమెరికన్ల ప్రయోజనాల మీద మాగొప్పగా మాట్లాడేస్తున్న పెద్దమనిషి.. పారిశ్రామికవేత్తగా మాత్రం హెచ్ 1బి వీసాల పేరిట భారీగా ఉద్యోగుల్ని విదేశాల నుంచి తెప్పించుకొని తన దగ్గర పనికి పెట్టుకోవటం గమనార్హం. అంటే.. వ్యాపారస్తుడిగా హెచ్ 1 బి వీసాల వల్ల ప్రయోజనం పొందిన ట్రంప్.. ఇప్పుడు మాత్రం తాను అధికారంలోకి వస్తే హెచ్ 1 బి వీసాలకు మంగళం పలకాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించటం చూస్తే.. అతగాడి మైండ్ సెట్ ఇట్టే అర్థమవుతుంది. తనకు ప్రయోజనం కలిగితే సరిపోతుందన్న వైఖరి ట్రంప్ లో స్పష్టంగా కనిపిస్తుంది.

చెప్పేందుకే నీతులు ఉన్నాయన్నట్లుగా.. పారిశ్రామివేత్తగా అమెరికన్ల ప్రయోనాల గురించి ఏనాడు ఆలోచించని డోనాల్డ్ ట్రంప్.. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే పగలు రాత్రి అన్న తేడా లేకుండా విద్వేషాన్ని అమెరికన్లకు నూరిపోయటం గమనార్హం. ఇప్పుడు తప్పులుగా ఎత్తి చూపుతున్నదే.. నిన్నటి వరకూ ఆచరించిన డోనాల్డ్ మాటలన్నీ రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పించి మరొకటి కాదని ఇట్టే అర్థమవుతుంది. ఇలాంటి వాడిని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ప్రపంచం ఎంత అల్లకల్లోలం అవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే వ్యక్తి మొత్తంగా కాకున్నా ఎంతోకొంత అయినా.. విశాల దృక్ఫదం ఉండాల్సిన అవసరం ఉంది. మరి.. ఈ విషయాన్ని అమెరికన్లు ఆలోచిస్తారా? లేదా? అన్నది చూడాలి.