Begin typing your search above and press return to search.

కర్రవిరగకుండా పాము చచ్చేలా ట్రంప్ ‘ఇమిగ్రేషన్’ నిషేధం

By:  Tupaki Desk   |   23 April 2020 11:45 AM IST
కర్రవిరగకుండా పాము చచ్చేలా ట్రంప్ ‘ఇమిగ్రేషన్’ నిషేధం
X
అమెరికాకు అన్ని రకాల వలసలను 60 రోజుల పాటు నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇందులో కీలక ట్విస్ట్ ఇచ్చారు. నిపుణులు, మేధో సంపత్తిగల వారికి ఇచ్చే హెచ్1బీ ప్రొఫెషనల్ వీసాదారులకు ఇది వర్తించకుండా కీలక మినహాయింపులు ఇచ్చారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసి తన రోజువారీ విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారు.

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన లక్షలమంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించడానికే తాను ఈ చర్య తీసుకున్నానని ట్రంప్ తెలిపారు. 60 రోజులు అన్ని రకాల వలసలు అమెరికాలోకి నిషేధమని.. ఆ తర్వాత దీనిపై పునపరిశీలిస్తానని తెలిపారు. తన నిర్ణయం కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన 22 మిలియన్ల అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. తాత్కాలిక వీసాలపై వచ్చేవారికి ఈ నిర్ణయం వర్తించదన్నారు.

ట్రంప్ తాజా నిర్ణయంతో కర్రవిరగకుండా పాము చచ్చేలా వ్యూహాత్మకంగా ఇమిగ్రేషన్ పాలసీని రూపొందించారు. అటు హెచ్1 బీతో అమెరికాకు నిపుణుల కొరత వాటిల్లకుండా.. ఇటు అమెరికన్లకు ఉద్యోగాలు లభించేలా వ్యూహాత్మకంగా ఈ ఇమిగ్రేషన్ పాలసీని రూపొందించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం బాగుందని అమెరికన్లు, కార్పొరేట్ కంపెనీలు కూడా చెబుతున్నాయి.

గ్రీన్ కార్డులు, శాశ్వత నివాసం హోదా పొందినవారికి.. తాత్కాలిక వీసాలు ఉన్నవారికి ఈ నిషేధం వర్తించదు.. కానీ విదేశీయులుగా వారు అమెరికాలో గుర్తింపులో ఉంటారు.

ఈ ఇమిగ్రేషన్ లో వలస వచ్చే వర్గాలలో ఆరోగ్య సంరక్షణ కార్మికులు, ఇతర వైద్య పరిశోధకులు, వైద్యులకు మినహాయింపునిచ్చారు.

విదేశీ నిపుణులైన వారు అమెరికా ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుండడంతో హెచ్1బీ, వ్యవసాయ దాని అనుబంధ నిపుణులకు ఇచ్చే హెచ్2ఏ వీసాలకు ట్రంప్ మినహాయింపునిచ్చారు. వీరికి పరిమితకాలం మాత్రమే మినహాయింపునిచ్చారు. శాశ్వత నివాస హోదాను ఇవ్వరు.

ప్రస్తుతం వీసాలలో 74శాతం హెచ్1బీ నిపుణులదే ఉన్నాయి. ఇందులో భారతీయుల వాటానే ఎక్కువ. అమెరికన్ సంస్థలతోపాటు.. అనేక భారతీయ సాంకేతిక సంస్థలు అమెరికాలో పనిచేయడానికి హెచ్1బీ వీసాలపైనే ఆధారపడుతాయి. ఇది భారతీయులకు గొప్ప ఊరట అని చెప్పవచ్చు. మనపై ట్రంప్ ఇమిగ్రేషన్ నిషేధం విధించలేదనే చెప్పాలి.

ఇక ఇతర దేశాల నుంచి అమెరికా కంపెనీలకు బదిలీ అయిన ఎల్1 వీసాలకు ఈ నిషేధం కవర్ చేయదు. గ్రీన్ కార్డులు కలిగిన పెట్టుబడిదారులకు మినహాయింపులు ఇఛ్చారు.

తాజా ఇమిగ్రేషన్ నిషేధంతో 28 యూరోపియన్ దేశాల వారు, చైనా, ఇరాన్ నుంచి వచ్చే ప్రయాణికులందరిపై ట్రంప్ నిషేధం విధించారు. హెచ్1బీ కలిగిన భారతీయులకు మాత్రం మినహాయింపు ఊరట కల్పించారనే చెప్పవచ్చు.