Begin typing your search above and press return to search.

ట్రంప్ రీఎంట్రీ.. వ‌చ్చీ రావ‌డంతోనే సంచ‌ల‌న కామెంట్లు

By:  Tupaki Desk   |   7 Jun 2021 3:30 AM GMT
ట్రంప్ రీఎంట్రీ.. వ‌చ్చీ రావ‌డంతోనే సంచ‌ల‌న కామెంట్లు
X
డొనాల్డ్ ట్రంప్‌. ఈ ఒక్క‌పేరు చాలు.. ఆయ‌న వైఖ‌రేంటో చెప్ప‌కుండా చెప్పొచ్చు. త‌న వివాదాస్ప‌ద కామెం ట్ల‌తో నిత్యం మీడియాలో ఉన్న అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చేశారు. వాస్త‌వానికి అగ్ర‌రాజ్యం అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రిగిన 7 మాసాలు పూర్త‌య్యాయి. ఆ ఎన్నిక‌ల్లో ట్రంప్ ఓడిపోయారు. అయితే.. సాధార‌ణంగా ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. అమెరికా ఎవ‌రూ కూడా అంత తొంద‌ర‌గా పుంజుకున్న హిస్ట‌రీ మ‌న‌కు క‌నిపించ‌దు.

కానీ, ట్రంప్ మాత్రం డిఫ‌రెంట్ క‌దా.. అందుకే ఆయ‌న కేవ‌లం ఆరేడు మాసాల్లోనే పొలిటిక‌ల్ రీఎంట్రీ ఇచ్చేశారు. 2020 అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత వైట్‌హౌస్‌ను వీడిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ఓ ప‌బ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. 2024 అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో తాను మ‌ళ్లీ పోటీ చేయ‌నున్న‌ట్లు ఇదివ‌ర‌కే సంకేతాలిచ్చిన ట్రంప్‌.. ఈ ఎన్నిక‌ల్లో నార్త్ క‌రోలినాను గెల‌వ‌బోతున్నామ‌ని తాజాగా ప్ర‌క‌టించారు. వేలాది రిపబ్లికన్ నేతలు, కార్యకర్తలతో నార్త్ కరోలినా రిపబ్లికన్ కన్వెన్షన్లో ఆయన భేటీ సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు.

"నార్త్ కరోలినాను గెలవబోతున్నాం. అందుకోసం ఇప్ప‌టినుంచే క్షేత్రస్థాయిలో పనిచేద్దాం. నేను ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న 2024లో నార్త్ కరోలినాలో మ‌రోసారి గెలిచి చూపిద్దాం." అని ట్రంప్ అన్నారు. అలాగే 2022 మధ్యంతర ఎన్నికల్లో తనకు విధేయంగా ఉండే అభ్యర్థులకు మాత్ర‌మే మద్దతివ్వాలని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ రిపబ్లికన్లను కోరారు. ఇక నార్త్ క‌రోలినా మొద‌టి నుంచి రిప‌బ్లిక‌న్ల‌కు కంచుకోట‌. గ‌త‌ 13 అధ్యక్ష ఎన్నికల్లో 11 సార్లు ఇక్క‌డ రిప‌బ్లిక‌న్లే విజ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు.

అమెరికా అధ్యక్షుడిగా వైదొలిగిన తర్వాత 2024 ఎన్నికల కోసం ఊవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఈ స‌మావేశం ద్వారా మ‌ళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దీంతో ట్రంప్ మ‌ళ్లీ ఆట మొద‌లెట్టార‌ని ఆయ‌న అభిమానులు, రిప‌బ్లిక‌న్ పార్టీ కార్య‌కర్తలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు, వ‌చ్చీ రావ‌డంతోనే భారీ టార్గెట్ పెట్టుకున్నార‌ని కూడా కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.