Begin typing your search above and press return to search.

ట్రంప్ నోట తాలిబ‌న్ల త‌ర‌హా మాట‌

By:  Tupaki Desk   |   31 March 2016 6:14 AM GMT
ట్రంప్ నోట తాలిబ‌న్ల త‌ర‌హా మాట‌
X
అగ్ర‌రాజ్యంగా.. స్వేచ్ఛాయుత జీవ‌నానికి కేరాఫ్ అడ్ర‌స్‌ గా చెప్పుకునే అమెరికాలో.. తాలిబ‌న్ల త‌ర‌హా పాల‌న రావ‌టాన్ని అస్స‌లు ఊహించ‌గ‌ల‌మా? తాలిబ‌న్ త‌ర‌హా పాల‌న అన్న‌ది పెద్ద మాట కావొచ్చు. క‌నీసం ఆ త‌ర‌హా ఆలోచ‌న‌లు ఉన్న వ్య‌క్తి అమెరికా అధ్యక్ష ప‌ద‌వి రేసులోకి వ‌చ్చే అవ‌కాశాన్ని ఊహించ‌గ‌ల‌మా? తాజాగా రిప‌బ్లిక‌న్ నేత డోనాల్డ్ ట్రంప్ నోట వ‌చ్చిన మాట వింటే ఒక్క‌సారి షాక్ తినాల్సిందే. అమెరికా అధ్య‌క్ష రేసులో ఉండాల‌నుకునే వ్య‌క్తి ఇలా కూడా ఆలోచిస్తారా? అన్న సందేహం క‌ల‌గ‌ల‌క మాన‌దు.

ట్రంప్ నోట వివాదాస్ప‌ద మాట‌లు కొత్తేం కాదుకానీ.. మ‌రీ తాలిబ‌న్ త‌ర‌హాలో మాట‌లు రావ‌టం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఫ్రీ లైఫ్ స్టైల్ ఉండే అమెరికాలో.. మ‌హిళ‌ల‌కు సంబంధించిన అబార్ష‌న్ విష‌యంలో అత‌డి మాట‌ల‌పై ఇప్పుడు పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇంత‌కీ ఇంత పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం కావ‌టానికి కార‌ణం ఏమిటంటే.. గ‌ర్భ‌స్రావం చేయించుకునే మ‌హిళ‌ల‌కు శిక్ష‌లు వేయాల‌ని ట్రంప్ చెప్ప‌ట‌మే. అయితే.. ఎలాంటి శిక్ష‌లు వేయాల‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌ని ఆయ‌న‌.. అబార్ష‌న్ చేయించుకునే మ‌హిళ‌ల‌కు శిక్ష ఉండాల‌ని చెప్పారు.

విస్కాన్సిన్‌ లోని ఒక చ‌ర్చ సంద‌ర్భంగా ఆయ‌నీ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. అబార్ష‌న్ల‌ను మీరు పూర్తిగా ర‌ద్దు చేయాల‌ని అనుకుంటున్నారా? అన్న ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చిన ట్రంప్‌.. త‌న స్పంద‌న‌ను తెలిపారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై డెమోక్రాటిక్ అభ్య‌ర్ది స్థానానికి పోటీ ప‌డుతున్న హిల్ల‌రీ క్లింట‌ర్ స్పందిస్తూ.. ట్రంప్ ఆలోచ‌న‌లు చెత్త‌గా.. భ‌యంక‌రంగా ఉన్నాయ‌న్నారు. హిల్ల‌రీ దాకా ఎందుకు స‌గ‌టుజీవి ఎవ‌రైనా ఇలాంటి అభిప్రాయాన్నే వ్య‌క్తం చేస్తార‌న‌టంలో సందేహం లేదు.