Begin typing your search above and press return to search.

అణు యుద్ధం అంటే ఏంటో తెలుసా ట్రంప్

By:  Tupaki Desk   |   4 April 2016 5:10 AM GMT
అణు యుద్ధం అంటే ఏంటో తెలుసా ట్రంప్
X
నోటి దురుసు ఉన్న వాళ్లు నాయకులుగా మారితే ఎలాంటి ఉపద్రవమో అమెరికా ప్రజలకు మాత్రమే కాదు.. ప్రపంచ ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోరిపబ్లికన్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్న సంపన్నుడు డోనాల్డ్ ట్రంప్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్ని సంచలనాలు సృష్టిస్తున్నాడో తెలిసిందే. తనదైన కంపు మాటలతో అమెరికా ప్రజలు మాత్రమే కాదు.. ప్రపంచ ప్రజల్లోనూ ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

వివిధ దేశాలతో పాటు.. అమెరికన్ మహిళలపై పదే పదే నోరు పారేసుకుంటున్న అతడి తీరుపై అమెరికా అధ్యక్షుడు సైతం పెదవి విప్పాల్సి వచ్చింది. హితవు చెప్పించుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ట్రంప్ నోట అణు యుద్ధం మాట రావటం ఆందోళనకరంగా మారింది. ప్రపంచ పెద్దన్నగా వ్యవహరిస్తూ.. ఆచితూచి వ్యవహరించాల్సిన అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న ట్రంప్.. ఉత్తర కొరియాతో అణుయుద్ధం గురించి వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడేయటం ఆందోళన కలిగిస్తోంది.

జపాన్.. దక్షిణ కొరియాల మీద ఆధారపడకుండానే ఉత్తర కొరియాతో అణు యుద్ధానికి సిద్ధం కావాలంటూ ట్రంప్ చేసిన మాటలపై అమెరికన్లతో పాటు ప్రపంచ ప్రజలు ఉలిక్కిపడే పరిస్థితి. యుద్ధాలే లేని సమాజం ఉండాలని.. ప్రపంచ ప్రజలంతా శాంతితో ఉండాలన్న ఆకాంక్ష బలంగా వినిపిస్తుంటే.. అందుకు భిన్నంగా రక్తపిపాసి మాదిరి అణు యుద్ధం గురించి బాధ్యతలేని వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ వ్యవహారశైలిపై మండిపాటు వ్యక్తమవుతోంది.

అమెరికన్ సైనికులు జపాన్ లో దాదాపు 54 వేల మంది వరకూ ఉంటారు. అదే విధంగా దక్షిణ కొరియాలో 28వేల మంది వరకూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులతోపాటు.. ఉత్తర కొరియా అధ్యక్షుడైన నియంత ఈ మధ్య కాలంలో అణుయుద్ధం గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న వేళ.. అతనికి ధీటుగా అన్నట్లు ట్రంప్ చేస్తున్న అణు యుద్ధం మాటలు మంట పుట్టిస్తున్నాయి. ట్రంప్ మాటల మీద మరోసారి స్పందించాల్సిన అవసరం అమెరికా అధ్యక్షుడి మీద పడింది. తాజాగా ఒబామా మాట్లాడుతూ.. అమెరికా ఫారిన్ పాలసీ గురించి తెలియని వ్యక్తులు మాత్రమే అణు యుద్ధం మాటల్ని మాట్లాడతారంటూ ట్రంప్ పై మండిపడ్డారు. ఏమైనా.. నోటి దురుసు.. బాధ్యతారాహిత్యంతో కూడిన వ్యాఖ్యలు చేసే ట్రంప్ లాంటి వ్యక్తి అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది బరిలోకి దిగినా పెద్ద ఇబ్బందే.