Begin typing your search above and press return to search.

చేసిన పనికి గూగుల్ సారీ చెప్పాలి

By:  Tupaki Desk   |   16 March 2020 6:06 PM IST
చేసిన పనికి గూగుల్ సారీ చెప్పాలి
X
సెర్చింజన్‌ గూగుల్‌ పై.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి కరోనాను కారణంగా చేసుకున్నారు. "కరోనా కట్టడికి సంబంధించిన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తప్పుడు వార్తలు వెళుతున్నాయి. గూగుల్‌ నుంచే అవి వెళుతున్నట్లు గుర్తించాం. ఆ వార్తలన్నీ నిజం కాదు. అలాంటి వార్తలను గూగుల్‌ తీసుకోకూడదు. ఇది నిజం కాదని గూగుల్‌ చెబుతోంది. కానీ చేసిన పనికి గూగుల్‌ క్షమాపణ చెప్పాల్సిందే. వారి క్షమాపణ కోసం ఎదురుచూస్తున్నా". ఇదీ ట్రంప్‌ ట్వీట్‌ సారాంశం. దీనిపై గూగుల్‌ యాజమాన్యం కూడా స్పందించింది. కరోనా వైరస్‌ వ్యాపించకుండా తీసుకునే చర్యల్లో యూఎస్‌ గవర్నమెంట్‌ తో కలిసి నడిచేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. ప్రజల్లో అవగాహన కల్పించి - సమాజ ఆరోగ్యాన్ని కాపాడతామని వెల్లడించింది.

ఓవైపు గూగుల్‌ ను తిడుతూనే - మరోవైపు పొగడ్తలు కూడా కురిపించారు ట్రంప్‌. కరోనా వైరస్ స్క్రీనింగ్ సైట్ విషయం గురించి తాను చెప్పినట్లు చేశారన్నారు. "గూగుల్ - గూగుల్ కమ్యూనికేషన్స్‌ టీమ్‌ లోని సభ్యులకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా" అంటూ ట్వీట్‌ చేశారు. గతంలోనూ గూగుల్‌ పై డొనాల్డ్ విమర్శలు కురిపించారు. యూఎస్‌ ఆర్మీ - రహస్య స్థావరాల వివరాలను చైనాకు చేరవేస్తున్నారని ఆరోపించారు. గూగుల్‌ మ్యాప్‌ ల్లో చూసి - అమెరికా సైనిక స్థావరాలను చైనా గుర్తిస్తోందని విమర్శించారు. దీని తర్వాత - గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ వైట్ హౌస్‌ కు వెళ్లి ట్రంప్ భేటీ అయ్యారు. ఆ సమావేశం తర్వాత ట్రంప్‌ శాంతించారు. అమెరికా ప్రయోజనాల కోసమే గూగుల్‌ పనిచేస్తోందని ట్వీట్‌ చేశారు.